సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!

- October 18, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!

రియాద్: సౌదీ అరేబియాలో నివాస, కార్మిక, సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించిన 13,822 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 8 నుంచి 14వ తేదీ వరకు వారం రోజుల పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల సహకారంతో నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.అరెస్టయిన వారిలో 6,547 మంది నివాస చట్టాలను, 3,896 మంది సరిహద్దు భద్రతా చట్టాలను, 3,379 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు.

అక్రమ ప్రవేశాలకు అడ్డుకట్ట

సౌదీ అరేబియా సరిహద్దుల గుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 2,021 మందిని అధికారులు పట్టుకున్నారు. అలాగే, అక్రమంగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన 28 మందిని అరెస్ట్ చేశారు. అక్రమ నివాసితుల్లో 9,454 మందిని దేశం నుంచి బహిష్కరించారు. మరో 20,190 మందిని ప్రయాణ పత్రాలు పొందేందుకు వారి వారి దౌత్య కార్యాలయాలకు పంపించారు. అదనంగా 6,509 మందిని ప్రయాణ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు సంబంధిత అధికారుల వద్దకు పంపించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

24 మంది సహకారదారుల అరెస్ట్

చట్టాలను ఉల్లంఘించిన వారికి రవాణా సౌకర్యాలు కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం, ఉద్యోగాలు కల్పించడం వంటి చర్యలకు పాల్పడిన 24 మందిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం 34,834 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యల ప్రక్రియ కొనసాగుతోంది. వీరిలో 32,433 మంది పురుషులు, 2,401 మంది మహిళలు ఉన్నారు.

కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిక

అక్రమంగా దేశంలోకి ప్రవేశించేవారికి సహాయం చేయడం, వారికి రవాణా సౌకర్యాలు కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం లేదా ఇతరత్రా సహకరించడం నేరమని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల సౌదీ రియాళ్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. నేరానికి ఉపయోగించిన వాహనాలు, ఆశ్రయం కల్పించిన ఇళ్లను కూడా స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అధికారులకు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 నంబర్‌కు, మిగతా ప్రాంతాల్లో 999 లేదా 996 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com