దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!

- October 18, 2026 , by Maagulf
దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!

దుబాయ్: దుబాయ్ విమానాశ్రయంలో ఓ మహిళ మరిచిపోయిన హ్యాండ్‌బ్యాగ్‌ను పోలీసులు భద్రంగా భద్రపరిచి, ఆమె తిరిగి యూఏఈకి వచ్చిన తర్వాత యథాతథంగా అప్పగించారు. బ్యాగులో నగదు, స్మార్ట్‌ఫోన్‌తో పాటు విలువైన వ్యక్తిగత వస్తువులు ఉండటంతో పోలీసులు చూపిన బాధ్యతాయుతమైన చర్యపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే ముందు మహిళ పొరపాటున తన హ్యాండ్‌బ్యాగ్‌ను అక్కడే వదిలివెళ్లింది. విషయం గుర్తించిన వెంటనే దుబాయ్ విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులు బ్యాగు కోసం గాలింపు చేపట్టారు. అవసరమైన తనిఖీలు, ధ్రువీకరణ ప్రక్రియలను పూర్తి చేసి బ్యాగును గుర్తించారు.

బ్యాగును పంపించాలా.. తిరిగి వచ్చేవరకు భద్రపరచాలా?

బ్యాగు లభించిన విషయాన్ని పోలీసులు మహిళకు తెలియజేశారు. అంతేకాకుండా, ఆమె వెళ్లిన దేశానికి బ్యాగును పంపించడం లేదా ఆమె తిరిగి దుబాయ్‌కి వచ్చే వరకు భద్రంగా ఉంచడం అనే రెండు అవకాశాలను కల్పించారు. దీంతో మహిళ రెండో మార్గాన్ని ఎంచుకుంది. ఆమె తిరిగి యూఏఈకి వచ్చిన తర్వాత బ్యాగును అందులోని వస్తువులన్నింటితో సహా పోలీసులు అప్పగించారు.

పోలీసులపై మహిళ ప్రశంసలు

దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ డైరెక్టర్ బ్రిగేడియర్ హమీద్ అల్ హషిమీ ఈ ఘటన వివరాలను వెల్లడించారు. ప్రయాణికుల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు, వారి వస్తువులను కాపాడేందుకు దుబాయ్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై సదరు మహిళ సోషల్ మీడియాలో స్పందిస్తూ యూఏఈ ప్రభుత్వం, దుబాయ్ పోలీసులు, సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. అధికారులు ప్రదర్శించిన వృత్తి నైపుణ్యం, నిజాయితీ, వేగవంతమైన స్పందనను ప్రశంసించింది. యూఏఈలో భద్రతా ప్రమాణాలపై తనకు మరింత నమ్మకం పెరిగిందని పేర్కొంది.ప్రయాణికుల వస్తువుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ దుబాయ్ పోలీసులు వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com