మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్‌–2026..!!

- October 19, 2026 , by Maagulf
మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్‌–2026..!!

మస్కట్: ఒమన్‌లో కళలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఐదో ఎడిషన్‌ ‘మస్కట్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌–2026’ నిర్వహించనున్నారు. బిలారబ్ బిన్ హైతమ్ ఇనిషియేటివ్స్‌, ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌ (OCEC) సంయుక్తంగా ఈ ప్రదర్శనను అక్టోబర్ 28 నుంచి 30 వరకు మస్కట్‌లోని ఎగ్జిబిషన్ హాల్‌లో నిర్వహించనున్నాయి. ఈ ఏడాది ప్రదర్శనలో 300 మందికి పైగా కళాకారులు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది.  

కళాకారులకు ప్రోత్సాహం

కళాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, వారి సృజనాత్మక రచనలు, చిత్రకళా నైపుణ్యాలను విస్తృత ప్రజానీకానికి పరిచయం చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కళాకారులు, ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్ల మధ్య పరస్పర చర్చలకు ఈ ప్రదర్శన వేదికగా నిలవనుంది. బిలారబ్ బిన్ హైతమ్ ఇనిషియేటివ్స్‌ ప్రతినిధి ఇంజినీర్ ఇయాద్ అల్ రవాస్ మాట్లాడుతూ.. సృజనాత్మకతకు మానవుడే కేంద్రబిందువని, కళాకారులకు స్ఫూర్తిదాయకమైన వేదికను అందించడం ద్వారా వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.

బిలారబ్ బిన్ హైతమ్ ఇనిషియేటివ్స్‌తో కలిసి ఈ ప్రదర్శనను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు OCEC చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయీద్ అల్ షన్‌ఫారీ. ఒమన్‌లోని కళా రంగంలోని వైవిధ్యాన్ని చాటడంతో పాటు ప్రజలకు విభిన్న కళా, సాంస్కృతిక అనుభవాలను అందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ ప్రదర్శనలో బిలారబ్ బిన్ హైతమ్ ఇనిషియేటివ్స్‌ ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

బిలారబ్ బిన్ హైతమ్ ఇనిషియేటివ్స్‌ 2022లో ప్రారంభమైంది. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆశీస్సులతో, హిజ్ హైనెస్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతమ్ అల్ సయీద్ పర్యవేక్షణలో ‘బిలారబ్ బిన్ హైతమ్ అవార్డ్ ఫర్ ఆర్కిటెక్చరల్ డిజైన్‌’తో ఈ కార్యక్రమం మొదలైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com