యూఏఈలో ఆన్‌లైన్‌లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!

- October 20, 2026 , by Maagulf
యూఏఈలో ఆన్‌లైన్‌లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!

దుబాయ్: సోషల్ మీడియా వేదికగా ఇతరులను దూషించడం, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం యూఏఈలో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి నేరాలకు జైలుశిక్షతో పాటు Dh250,000 నుంచి Dh500,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో నిర్వహిస్తున్న సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌ మంత్‌ సందర్భంగా యూఏఈ ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. ‘ది యూఏఈ ఈజ్ సేఫ్ విత్ యువర్ డిజిటల్ అవేర్‌నెస్’ పేరుతో నిర్వహిస్తున్న దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దుబాయ్ పోలీసులు, దుబాయ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సెంటర్ (DESC) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

సైబర్‌ నేరాల చట్టం ప్రకారం చర్యలు

ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 34 ఆఫ్ 2021లోని ఆర్టికల్ 43 ప్రకారం, సమాచార నెట్‌వర్క్ లేదా సమాచార వ్యవస్థను ఉపయోగించి మరొక వ్యక్తిని అవమానించడం లేదా అతడిని శిక్షకు గురిచేసేలా, ఇతరుల దృష్టిలో చులకన చేసేలా ఆరోపణలు చేయడం నేరంగా పరిగణించవచ్చు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి జైలుశిక్ష, Dh250,000 నుంచి Dh500,000 వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది. అధికారిక విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడితే శిక్ష మరింత తీవ్రంగా ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

సోషల్ మీడియాను వ్యక్తిగత దూషణలు, ఎగతాళి, ఇతరుల పరువు తీసే వ్యాఖ్యలకు వేదికగా మార్చకూడదని ప్రచార కార్యక్రమం సూచిస్తోంది. భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ, నిర్మాణాత్మక చర్చలు జరపాలని ప్రజలకు పిలుపునిస్తోంది.సమాజ విలువలకు అనుగుణంగా సానుకూల సంభాషణలను ప్రోత్సహించడం ద్వారా సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని నిర్మించాలని అధికారులు కోరుతున్నారు.

ఆన్‌లైన్ మోసాలపైనా అవగాహన

‘ది యూఏఈ ఈజ్ సేఫ్ విత్ యువర్ డిజిటల్ అవేర్‌నెస్’ ప్రచారం కేవలం ఆన్‌లైన్ దూషణలకే పరిమితం కాలేదు. సైబర్ నేరాలు, ఇంటర్నెట్ మోసాలు, AI సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగంపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, ఇంటర్నెట్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలంతా ఈ ప్రచార కార్యక్రమం కొనసాగనుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com