దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష

- October 20, 2026 , by Maagulf
దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష

కార్లను అద్దెకు తీసుకుని, నకిలీ పత్రాలతో ఇతరులకు అద్దెకు ఇచ్చి.. ప్రమాదాల పేరుతో బీమా సొమ్ము కాజేసేందుకు యత్నం

దుబాయ్: లగ్జరీ కార్లను అద్దెకు తీసుకుని, వాటి పత్రాలు, నంబర్ ప్లేట్లను మార్చి, ఇతరులకు అద్దెకు ఇచ్చి, ఆ తర్వాత కావాలనే ప్రమాదాలు సృష్టించి ఇన్సూరెన్స్ సొమ్ము పొందేందుకు ప్రయత్నించిన ఐదుగురికి దుబాయ్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది. నిందితులకు జరిమానాలు విధించడంతో పాటు, దెబ్బతిన్న లేదా తిరిగి అప్పగించని వాహనాల విలువను ఉమ్మడిగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. శిక్షాకాలం పూర్తయిన అనంతరం నిందితులను దేశం నుంచి బహిష్కరించాలని తీర్పునిచ్చింది.

పక్కా ప్రణాళికతో మోసం
కోర్టు పత్రాల ప్రకారం.. నిందితులు దుబాయ్‌లోని పలు కార్ల అద్దె సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. తొలుత చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలతో ఖరీదైన కార్లను అద్దెకు తీసుకునేవారు. అద్దె ఒప్పందాల గడువు ముగిసినప్పటికీ వాటిని యజమానులకు తిరిగి అప్పగించకుండా తమ వద్దే ఉంచుకునేవారు.

ఆ తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, నంబర్ ప్లేట్లలో మార్పులు చేసి, ఆ కార్లను ఆన్‌లైన్ వేదికల ద్వారా తక్కువ ధరలకు ఇతరులకు అద్దెకు ఇచ్చేవారు. దీంతో అసలు కార్ల అద్దె సంస్థలకు తమ వాహనాలు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా పోయేది.

ప్రమాదాల పేరుతో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు
కార్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించిన నిందితులు.. వాటిలో కొన్ని వాహనాలతో ఉద్దేశపూర్వకంగా రోడ్డు ప్రమాదాలు సృష్టించారు. ఈ ప్రమాదాలు నిజంగానే జరిగినట్లు చూపిస్తూ, వాహనాలకు జరిగిన నష్టానికి పరిహారం పొందేందుకు బీమా క్లెయిమ్‌లు దాఖలు చేశారు.

ట్రాకింగ్ వ్యవస్థతో వెలుగులోకి..
ఓ కార్ల అద్దె సంస్థ తన వాహనాల ట్రాకింగ్ వ్యవస్థలో అనుమానాస్పద మార్పులను గుర్తించింది. పలు వాహనాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, అదృశ్యమైన కార్ల ఆచూకీని గుర్తించారు.

భూగర్భ పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను గుర్తించిన పోలీసులు.. వాటి పత్రాలు మార్చినట్లు ఆధారాలు సేకరించి, ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

సివిల్ వివాదమన్న వాదనను తోసిపుచ్చిన కోర్టు
ఈ కేసులో నిందితుల తరఫు న్యాయవాదులు.. ఇది కేవలం అద్దె ఒప్పందాల ఉల్లంఘనకు సంబంధించిన వివాదమని, సివిల్ కేసుగా పరిగణించాలని వాదించారు. అయితే, వాహనాలను తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా అధికారిక పత్రాలను మార్చడం, బీమా పరిహారం పొందేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రమాదాలు సృష్టించడం వంటి చర్యలు నేరపూరితమైనవని కోర్టు స్పష్టం చేసింది.

దీంతో ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి జైలు శిక్షలు, ఆర్థిక జరిమానాలు విధించింది. దెబ్బతిన్న, తిరిగి అప్పగించని కార్ల విలువను కూడా ఉమ్మడిగా చెల్లించాలని ఆదేశించింది. శిక్ష పూర్తయిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com