రస్ అల్ ఖైమాలో అన్ని బీచ్‌లు మూసివేత.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు
- October 24, 2026
రస్ అల్ ఖైమా: యూఏఈలోని రస్ అల్ ఖైమా ఎమిరేట్‌లో అన్ని బీచ్‌లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈ నిర్ణయానికి గల కారణాలను అధికారులు వెంటనే వెల్లడించలేదు. బీచ్‌లను తిరిగి ఎప్పుడు తెరవనున్నారనే విషయాన్ని తగిన సమయంలో ప్రకటిస్తామని తెలిపారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు బీచ్‌లకు వెళ్లకుండా అధికారులకు సహకరించాలని కోరారు.
షార్జాలోనూ తాత్కాలికంగా బీచ్ మూసివేత
యూఏఈలోని ఇతర ఎమిరేట్లలోనూ తీర ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు చేపడుతున్నారు. సమీప సముద్ర జలాల్లో చమురు ఆనవాళ్లు కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా అల్ హమ్రియా బీచ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు షార్జా అధికారులు శుక్రవారం ప్రకటించారు.
ఉమ్ అల్ ఖైవైన్ సముద్ర జలాల్లో చోటుచేసుకున్న చమురు లీకేజీ కారణంగానే పలు ఎమిరేట్లలో ప్రజలు ఇంధనం వంటి వాసనను గుర్తించినట్లు యూఏఈ వాతావరణ మార్పులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ గతంలో వెల్లడించింది.
ఉమ్ అల్ ఖైవైన్లోనూ తీర ప్రాంతాలు మూసివేత
ఉమ్ అల్ ఖైవైన్లోని అన్ని బీచ్‌లు, తీర ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సముద్ర జలాల పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి, ప్రజల భద్రతతో పాటు సముద్ర పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టిన తర్వాతే తిరిగి తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
చమురు లీకేజీ గుర్తించిన వెంటనే సంబంధిత బృందాలు రంగంలోకి దిగి, చమురు వ్యాప్తిని అడ్డుకోవడం, ప్రభావిత ప్రాంతాలను పరిమితం చేయడం, శుభ్రపరిచే చర్యలు చేపట్టడం ప్రారంభించాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, ప్రజలు గుర్తించిన ఇంధనం వంటి వాసన వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.
బీచ్‌లకు వెళ్లాలనుకునే పర్యాటకులు, నివాసితులు సంబంధిత అధికారుల తాజా ప్రకటనలను గమనిస్తూ, భద్రతా సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
- రస్ అల్ ఖైమాలో అన్ని బీచ్‌లు మూసివేత.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు
- ఏపీకి వాయుగుండం ముప్పు.. IMD హెచ్చరిక
- ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలు పీవీ సింధు
- యూఏఈలో పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు..
- బహ్రెయిన్‌లో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరట..!!
- ఒమన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ.. వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్..!!
- కువైట్‌లో నవంబర్ 6న సైన్స్ ఫెయిర్..ఉచిత ప్రవేశం..!
- ఖతార్‌లో డిజిటల్ వ్యాపారులకు గుడ్ న్యూస్..!!
- గాల్లోనే రెండు విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి!







