2027లో సరికొత్తగా దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!
- October 26, 2026
దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ 2027 మొదటి త్రైమాసికంలో మళ్లీ సందర్శకుల కోసం తెరుచుకోనుంది. అయితే ఈసారి భవనంలోకి అడుగుపెట్టే సందర్శకులకు గతంలో ఉన్న ప్రదర్శనలు కాకుండా, పూర్తిగా కొత్త అనుభవాలు అందుబాటులోకి రానున్నాయి. 2022 ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ మ్యూజియం కొత్త ప్రదర్శనలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అనుభవాలు, పరిశోధనా ప్రయోగశాలలతో మరో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోంది. పునఃప్రారంభానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.
సరికొత్త ప్రపంచం
మ్యూజియం ప్రస్తుత ప్రదర్శనలను కేవలం అప్డేట్ కాకుండా, సరికొత్త దిశలో సందర్శకుల అనుభవాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మ్యూజియం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అజ్జా అల్ నుఐమీ తెలిపారు. కొత్త ప్రదర్శనల్లో సందర్శకులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా అన్వేషించే అవకాశం ఉంటుందన్నారు.
పాత ప్రదర్శనల పరిస్థితి ఏమిటి?
ఇప్పటివరకు సందర్శకులు మ్యూజియంలో OSS Hope అంతరిక్ష నౌక ద్వారా 2071 నాటి ఊహాత్మక ప్రపంచాన్ని ఆస్వాదించేవారు. హీల్ ఇన్‌స్టిట్యూట్, అల్ వహా, టుమారో టుడే, చిన్నారుల కోసం ఫ్యూచర్ హీరోస్ వంటి విభాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొత్త మార్పుల్లో భాగంగా ఈ ప్రదర్శనలను తొలగించి కొత్త అనుభవాలకు అవకాశం కల్పించనున్నట్లు అజ్జా అల్ నుఐమీ వెల్లడించారు. అయితే పాత ప్రదర్శనల్లోని వస్తువులు, నమూనాల్లో వేటిని భద్రపరచాలి, ఇతర ప్రాంతాలకు తరలించాలి, తిరిగి ఉపయోగించాలి లేదా పూర్తిగా తొలగించాలనే అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఏఐ, అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యం
2022లో మ్యూజియం ప్రారంభమైనప్పటి నుంచి AI, బయోటెక్నాలజీ, అంతరిక్ష పరిశోధన రంగాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాత ఆలోచనలు, ప్రదర్శనలను కొత్త ప్రశ్నలు, పరిశోధనలతో అనుసంధానించాల్సిన అవసరం ఏర్పడిందని మ్యూజియం అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయడం మ్యూజియం ఉద్దేశం కాదని, అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించడం, ప్రస్తుత ఆలోచనలను ప్రశ్నించడం, భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలపై ఆలోచించేలా చేయడమే లక్ష్యమని అజ్జా అల్ నుఐమీ వివరించారు.
20వేల దరఖాస్తులు..
మ్యూజియం సందర్శకుల అనుభవ బృందంలో సిబ్బంది నియామకం కోసం చేపట్టిన ‘ఫ్యూచర్ పర్‌ఫెక్ట్స్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తొలి 48 గంటల్లోనే 20వేలకు పైగా పూర్తయిన దరఖాస్తులు అందినట్లు మ్యూజియం వెల్లడించింది. మ్యూజియం భవిష్యత్తులో ఏ అంశాలను ప్రదర్శించాలనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుంచి 1,000కు పైగా ఆలోచనలు అందాయని, వాటిలో కొన్నింటిని కొత్త ప్రదర్శనల్లో ఇప్పటికే భాగం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మ్యూజియం తొలి దశలో ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా సందర్శకులను ఆకర్షించింది. అలాగే 620 కార్యక్రమాలు, 224 విద్యా కార్యక్రమాలను నిర్వహించింది.
టికెట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
మ్యూజియం తిరిగి ప్రారంభమయ్యే సమయానికి దగ్గరగా కొత్త అనుభవాలకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని అధికారిక సమాచారం పేర్కొంది. 2027లో మ్యూజియం తన ఐదో వార్షికోత్సవ సమయానికి సమీపంలో పునఃప్రారంభం కానుందని భావిస్తున్నారు. భవనం వెలుపలి రూపం పెద్దగా మారకపోయినా, లోపల సందర్శకులకు అందించే అనుభవం మాత్రం పూర్తిగా కొత్తగా ఉండనుంది.
తాజా వార్తలు
- ఆర్థిక సంబంధాల బలోపేతంపై కువైట్–భారత్ చర్చలు..!!
- సౌదీ అరేబియా రక్షణ రంగంలో కీలక పురోగతి..!!
- మస్కట్–ముంబై.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం..!!
- బహ్రెయిన్‌లో ‘ట్రీ వీక్’ నిర్వహించిన న్యూ ఇండియన్ స్కూల్..!!
- 2027లో సరికొత్తగా దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!
- ఖతార్‌లో ‘బైతి బైతక్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- రామమందిరానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శన వేళల్లో మార్పులు!
- రాష్ట్రపతి తో తెలంగాణ గవర్నర్ భేటీ
- దుబాయ్‌లో వింటర్ క్యాంపింగ్ సీజన్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..
- హైదరాబాద్‌లో ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మహిళల అరెస్ట్







