మస్కట్‌–ముంబై.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం..!!

- October 26, 2026 , by Maagulf
మస్కట్‌–ముంబై.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం..!!

మస్కట్‌: ఒమన్‌ నుంచి ముంబైకి ప్రయాణించే విమాన ప్రయాణికులకు కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ తన మస్కట్‌–ముంబై విమాన సేవలను జనవరి 2027 నుంచి నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి (NMIA) తరలించనుంది. ముంబైలోని ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) నుంచి కొత్త విమానాశ్రయానికి కార్యకలాపాలను దశలవారీగా మార్చే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలోని ప్రస్తుత విమానాశ్రయంలో టెర్మినల్ 1 పలు డెవలప్ మెంట్ పనులకు వీలు కల్పించేందుకు ఈ మార్పులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

దశలవారీగా విమాన సేవల మార్పు

ఎయిర్ ఇండియా గ్రూప్ తన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సేవలను ముంబై నుంచి పలు అంతర్జాతీయ నగరాలకు నవీ ముంబై విమానాశ్రయానికి తరలించనుంది. ఈ జాబితాలో మస్కట్‌, జెడ్డా, రియాద్‌, దమ్మామ్‌, దోహా, షార్జా నగరాలు ఉన్నాయి.

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ డిసెంబర్ 2026లో రోజుకు నాలుగు దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించనుంది.  

ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు

ముంబైలోని రెండు విమానాశ్రయాల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రయాణికులకు మరిన్ని ప్రయాణ ఎంపికలు అందుబాటులోకి తీసుకురావడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రస్తుత విమాన స్లాట్ల ప్రాధాన్యాన్ని కాపాడుకుంటూ, విమాన సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు.

కాగా, నవీ ముంబై విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు ప్రారంభించే ఎయిర్ ఇండియా గ్రూప్ ప్రణాళికను అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ స్వాగతించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వివిధ రవాణా మార్గాలతో అనుసంధానం, భవిష్యత్తులో పెరిగే విమాన ప్రయాణ అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాలతో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది.

మస్కట్‌ నుంచి ముంబైకి ప్రయాణించే భారతీయ ప్రవాసులు జనవరి 2027 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు విమానం చేరుకునే విమానాశ్రయం నవీ ముంబై (NMIA)నా, లేక ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA)నా అనేది టికెట్‌లో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com