బహ్రెయిన్‌లో గృహ రుణాల పరిమితి పెంపుపై ప్రభుత్వ అభ్యంతరం..!!
- October 27, 2026
మనామా: బహ్రెయిన్‌లో ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి ఇచ్చే గృహ రుణాల పరిమితిని BD120,000కు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం అమలైతే గృహ సాయం కోసం ఎదురుచూస్తున్న ఇతర కుటుంబాలకు అందుబాటులో ఉండే నిధులు తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఎంపీ జలాల్ కాధిమ్ ఈ ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇళ్ల ధరలు, నిర్మాణ ఖర్చులు భారీగా పెరగడంతో చాలా మంది బహ్రెయిన్ పౌరులు ఇళ్లు కొనడానికి లేదా నిర్మాణాలను పూర్తి చేయడానికి వాణిజ్య బ్యాంకుల నుంచి అదనపు రుణాలు తీసుకోవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. దీంతో గృహ రుణాలతో పాటు వ్యక్తిగత రుణాల చెల్లింపులు కూడా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని తెలిపారు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు అదనపు అప్పులు చేయకుండా సొంత ఇళ్లను కొనుగోలు చేసేందుకు రుణ పరిమితిని పెంచాలని ఆయన ప్రతిపాదించారు. తొలుత BD80,000 నుంచి BD120,000 వరకు రుణాలు అందించాలని సూచించినప్పటికీ, సవరించిన బిల్లులో కనీస పరిమితిని తొలగించి గరిష్ఠ పరిమితిని మాత్రమే పొందుపరిచారు.
అయితే, ప్రస్తుత నిబంధనల ప్రకారమే గృహ రుణ పరిమితులను పెంచే అధికారం హౌసింగ్ మంత్రిత్వ శాఖకు ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2022లో జారీ చేసిన నిబంధనల ప్రకారం, దరఖాస్తుదారుల ఆదాయాన్ని బట్టి గరిష్ఠంగా BD70,000 వరకు గృహ రుణ సదుపాయం కల్పించవచ్చు. అలాగే, 2025లో ప్రారంభించిన తస్హీల్+ (Tasheel+) పథకం ద్వారా అర్హులైన బహ్రెయిన్ పౌరులకు ప్రభుత్వ మద్దతుతో కలిపి BD91,000 వరకు బ్యాంకు రుణాలు అందిస్తున్నారు.
గృహ రుణాల గరిష్ఠ పరిమితిని BD120,000గా చట్టంలోనే నిర్ణయిస్తే, ఇళ్ల ధరలు, నిర్మాణ వ్యయాలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తులో మార్పులు చేయడం కష్టమవుతుందని ప్రభుత్వం తన ఏడు పేజీల నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా, BD120,000 పరిమితిని నిర్ణయించడానికి అవసరమైన ఆర్థిక అధ్యయనాన్ని బిల్లులో సమర్పించలేదని అభ్యంతరం తెలిపింది.
ప్రతి లబ్ధిదారుడికి అధిక మొత్తంలో రుణాలు అందిస్తే, ఇతర కుటుంబాలకు కేటాయించే నిధులు తగ్గుతాయని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో పెండింగ్‌లో ఉన్న గృహ సాయం దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపింది. రుణ పరిమితిని పెంచడం ఒక్కటే గృహ కొరత సమస్యకు పరిష్కారం కాదని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం, గృహాలను అందుబాటు ధరల్లో ఉంచడం, ప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగించడం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించింది.
లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 1976 నాటి హౌసింగ్ చట్టాన్ని సవరించడానికి బదులుగా, ప్రస్తుతం అమల్లో ఉన్న మంత్రిత్వ శాఖ నిబంధనల్లో మార్పులు చేయాలని సూచించింది. దీనివల్ల అవసరాలకు అనుగుణంగా గృహ రుణ పరిమితులను సులభంగా సవరించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- పెన్షన్ వ్యవస్థలో ఖతార్‌కు మెరుగైన ర్యాంకింగ్..!!
- సౌదీలో స్పోర్ట్స్ టికెట్ల విక్రయాలకు కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో 2026 మీడియా ఎక్సలెన్స్ విజేతలకు సత్కారం..!!
- డిసెంబర్లో అబుదాబిలో అరుదైన లగ్జరీ కార్ల వేలం..!
- కువైట్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత..!!
- బహ్రెయిన్‌లో గృహ రుణాల పరిమితి పెంపుపై ప్రభుత్వ అభ్యంతరం..!!
- సల్మానియాలో ప్రత్యేక బ్రెస్ట్ హెల్త్ యూనిట్ ప్రారంభం..!
- దుబాయ్‌లో కార్ నంబర్ ప్లేట్ కు భారీ ధర.. !!
- ఒమన్ అభివృద్ధికి యువతే పునాది..!!
- సౌదీలో విద్యుత్, వాటర్ ఛార్జీల సవరణ..!!







