ఒమన్‌లో 2026 మీడియా ఎక్సలెన్స్ విజేతలకు సత్కారం..!!

- October 27, 2026 , by Maagulf
ఒమన్‌లో 2026 మీడియా ఎక్సలెన్స్ విజేతలకు సత్కారం..!!

మస్కట్: ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 మీడియా ఎక్సలెన్స్ పోటీల విజేతలను ఘనంగా సత్కరించారు. విద్యాశాఖ మంత్రి డాక్టర్ మదీహా బింట్ అహ్మద్ అల్ షైబానీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హరాసీ పాల్గొన్నారు. ఈ పోటీలకు మొత్తం 21 విభాగాల్లో 432 ఎంట్రీలు వచ్చాయి. జర్నలిజం విభాగంలో 115, రేడియోలో 85, టెలివిజన్‌లో 100, ఎలక్ట్రానిక్ మీడియాలో 132 ఎంట్రీలు నమోదయ్యాయి. 

ఒమన్ మీడియా రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహించడం, ప్రతిభావంతులను గుర్తించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సమాచార మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ, పోటీల ప్రధాన కమిటీ చైర్మన్ మహమ్మద్ బిన్ సయీద్ అల్ బలూషి మాట్లాడుతూ.. మీడియా నిపుణులను ప్రోత్సహించడం, సంస్థల పనితీరును మెరుగుపరచడం, నాణ్యమైన కంటెంట్‌ను అభివృద్ధి చేయడం తమ శాఖ లక్ష్యాలని తెలిపారు. జాతీయ గుర్తింపును బలోపేతం చేయడం, ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం, వదంతులు మరియు తప్పుడు సమాచారాన్ని అరికట్టడంలో బాధ్యతాయుతమైన మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

2026 పోటీలకు అనుబంధంగా ఏఐ యుగంలో భవిష్యత్ మీడియా: సృజనాత్మకత, ఆవిష్కరణలు అనే అంశంపై ఉపన్యాసం, టెలివిజన్ డ్రామా స్క్రిప్ట్ రచనపై వర్క్‌షాప్ నిర్వహించారు. 2004లో ప్రారంభమైన ఈ పోటీలు ఒమన్ మీడియా రంగంలో ప్రతిభను, వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో ‘ఫిక్రా’ (ఆలోచన) అనే పాత్ర ద్వారా సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే ప్రయాణాన్ని ప్రదర్శించే కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒమన్ నాటక రంగానికి చెందిన సాలెహ్ జాల్, ఫఖ్రియా ఖమీస్ ఇందులో పాల్గొన్నారు. దేశంలోని పత్రికా, రేడియో, టెలివిజన్ రంగాల చరిత్రను గుర్తుచేసే ‘ఒమన్ మీడియా’ ప్రదర్శనతో వేడుక ముగిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com