బహ్రెయిన్‌లోని రెండు చారిత్రక కట్టడాలకు అరుదైన గుర్తింపు..!!

- October 29, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లోని రెండు చారిత్రక కట్టడాలకు అరుదైన గుర్తింపు..!!

మనామా: బహ్రెయిన్ రాజధాని మనామాలోని రెండు ప్రముఖ చారిత్రక కట్టడాలకు ప్రాంతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. బాబ్ అల్ బహ్రెయిన్, చారిత్రక మనామా మున్సిపాలిటీ భవనాలను అరబ్ ఆర్కిటెక్చరల్ అండ్ అర్బన్ హెరిటేజ్ రిజిస్టర్‌లో చేర్చారు. దేశ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే ప్రయత్నాల్లో భాగంగా ఈ గుర్తింపు లభించినట్లు బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ వెల్లడించింది. అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయంలో ఈ అక్టోబర్‌లో జరిగిన అరబ్ అబ్జర్వేటరీ ఫర్ ఆర్కిటెక్చరల్ అండ్ అర్బన్ హెరిటేజ్ 11వ సమావేశం అనంతరం ఈ మేరకు ప్రకటించారు. ఈ హెరిటేజ్ జాబితా అరబ్ లీగ్‌కు అనుబంధంగా పనిచేసే అరబ్ ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ (ALECSO) పరిధిలో ఉంది.

1949లో నిర్మించిన బాబ్ అల్ బహ్రెయిన్ ఒకప్పుడు మనామా సముద్ర తీరానికి సమీపంలో ఉండేది. సంప్రదాయ మనామా సౌక్‌కు ప్రధాన ప్రవేశ ద్వారంగా గుర్తింపు పొందింది. నేటికీ ఈ కట్టడం బహ్రెయిన్ వాణిజ్య, సాంస్కృతిక చరిత్రకు చిహ్నంగా నిలుస్తోంది. మనామా సౌక్‌లో సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు, వస్త్రాలు, హస్తకళా వస్తువుల విక్రయాలు కొనసాగుతున్నాయి.

మనామా మున్సిపాలిటీ చరిత్ర 1919లో ప్రారంభమైంది. అప్పట్లో ఏర్పాటైన ఈ మున్సిపాలిటీ గల్ఫ్ ప్రాంతంలోనే తొలి మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం చారిత్రక భవనంగా గుర్తింపు పొందిన మున్సిపాలిటీ భవనం 1962లో నిర్మితమైంది. ఈ కట్టడం బహ్రెయిన్‌లో స్థానిక పరిపాలన, ప్రజా సేవల అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. భవనం అసలు నిర్మాణ శైలిని కాపాడేందుకు పునరుద్ధరణ పనులు కూడా చేపట్టారు.

ఈ రెండు కట్టడాలకు లభించిన గుర్తింపు బహ్రెయిన్ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలన్న జాతీయ ప్రయత్నాలకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. నగరం ఆధునికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, చారిత్రక భవనాలను పరిరక్షించడం ద్వారా గత తరాల జీవన విధానం, వాణిజ్యం, పరిపాలనా చరిత్రను భవిష్యత్ తరాలకు అందించవచ్చని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com