సినిమా రివ్యూ: ‘ఆదర్శ కుటుంబం’.!

- October 30, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఆదర్శ కుటుంబం’.!

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. గతంలో త్రివిక్రమ్ రైటర్‌గా వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్స్ అవి.. అనడం అతిశయోక్తి కాదు. వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ శైలికి, త్రివిక్రమ్ రాసిన మాటలు అలాంటివి. డైరెక్టర్‌తో పని లేకుండా.. త్రివిక్రమ్ మాటలకు వెంకటేష్ నటన ఆ రెండు సినిమాల్ని ఎక్కడో నిలబెట్టేశాయ్. అలాంటిది త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాకా ఈ కాంబినేషన్ సెట్ కాలేదింతవరకూ. ఎప్పటి నుంచో ఈ కాంబో గురించి ఎదురు చూస్తున్నారు ఎంటర్‌ట‌ైన్‌మెంట్‌ని కోరుకునే ఆడియన్స్. మరి, ఆడియన్స్ కల అయితే నెరవేరింది. ఈ కాంబినేషన్ అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే ‘ఆదర్శ కుటుంబం’ కథలోకి వెళ్లాల్సిందే.

బీహారీ గ్యాంగ్ చేసే అకృత్యాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే చిట్టిబాబు (వెంకటేష్) ఓ మామూలు బ్యాంక్ ఉద్యోగి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి), కూతురు సంపూర్త (యువీనా) కొడుకు సర్వ (ప్రజ్వల్)తో కలిసి ఓ సాధారణ జీవితం గడిపేస్తుంటాడు. చిట్టీల  వ్యాపారం చేసే స్వర్ణ, జనం మోసం చేయడంతో కుటుంబాన్ని అప్పుల పాలు చేస్తుంది. కొడుక్కేమో చదువు అబ్బదు. టీనేజ్‌లో వున్న కూతురు మెకానిక్‌తో ప్రేమాయణం సాగిస్తూ..చిట్టిబాబుకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇన్ని కష్టాల మధ్య సంసారాన్ని నెట్టుకొస్తున్న చిట్టిబాబుకి అనుకోకుండా 100 కోట్ల లాటరీ తగులుతుంది. దాంతో, చిన్న అద్దె ఇంటి నుంచి ఓ కాస్ట్‌లీ బంగ్లాకి సంసారాన్ని మారుస్తాడు. ఇదంతా తెలిసిన బీహారీ గ్యాంగ్ టార్జన్, చిట్టిబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. దాంతో కథ మలుపు తిరుగుతుంది. ఇదిలా వుంటే, ఈ దోపిడీ గ్యాంగ్ ‘టార్జన్ అండ్ కో‌ని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసాఫీసర్ దామోదర్ నాయుడు అండ్ టీమ్ కూడా చిట్టిబాబు ఫ్యామిలీ వెంట పడుతుంది.  మరి, ఈ టార్జన్ గ్యాంగ్ నుంచి, పోలీసుల నుంచి చిట్టిబాబు తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు.? ఈ కథలో మాలతి (నివేదా పేతురాజ్) పాత్రేంటీ.? ప్రదీప్ సర్కార్ (నాజర్) ఎవరు.? డీఎస్పీ (రావు రమేష్) ప్రభావం ఏంటీ.?  చిత్త రంజన్ (సత్య) ఎవరు.? ఇవన్నీ తెలుసుకోవాలంటే  ‘ఆదర్శ కుటుంబం’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
ఈ తరహా ఫ్యామిలీ జోనర్ సినిమాలంటే వెంకటేష్ ఏ రేంజ్‌లో రెచ్చిపోతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంచనాలు ఏమాత్రం తారు మారు కావు ఈ సినిమాలోనూ. ప్రధమార్ధమంతా తన శైలి వినోదంతో ఆకట్టుకున్నాడు వెంకటేష్. సెకండాఫ్‌లో తనదైన యాక్షన్ చూపించాడు (ఫన్ మిస్ కానివ్వలేదనుకోండి). శ్రీనిధి శెట్టికి ఈ సినిమాలో స్వర్ణ పాత్ర బాగా సెట్టయ్యింది. అందంగా కనిపిస్తూనే తన పాత్రకు న్యాయం చేసింది. ప్రజ్వల్, యువీనా తమ పాత్రల పరిధి మేర నటించారు. పాత్రకు ప్రాధాన్యతను చూసుకుని సెలెక్ట్ చేసుకునే నారా రోహిత్ పాత్ర ఈ సినిమాలో పెద్దగా ప్రభావం చూపించదు. కొన్ని చోట్ల చాలా సిల్లీగా అనిపిస్తుంది. దోపిడీ ముఠాని పట్టుుకునే అవకాశం డైరెక్ట్‌గా వచ్చినప్పటికీ తేలిగ్గా వదిలేసే పోలీసాఫీసర్‌గా తేలిపోతాడు నాారా రోహిత్. రావు రమేష్ పాత్రకు తక్కువ స్సేస్ వున్నప్పటికీ తనదైన అనుభవం చూపించాడు త్రివిక్రమ్ డైరెక్షన్ మళ్లీ. సత్య తెరపై కనిపించినప్పుడల్లా నవ్వులే నవ్వులు. రఘు బాబు, నాజర్, షఫీ, త్రివిక్రమ్ సెంటిమెంట్ హీరోయిన్ నివేదా పేతురాజ్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఈ మధ్య పస తగ్గిందన్న టాక్ వినిపించింది. అయితే, అది నిజమేనా.! కాదా.! అని తేల్చలేని పరిస్థితి. ఫస్టాఫ్ అంతా తన మార్క్ వినోదం చూపించాడు. సెకండాఫ్‌లో కాస్త తడబడ్డాడనిపిస్తుంది. పెద్దగా ఫోకస్ పెట్టలేదన్న అభిప్రాయాలు వస్తున్నప్పటికీ సినిమాటిక్ లిబర్టీతో ముందుకెళ్లిపోవచ్చు. ఇంటర్వెల బ్లాక్.. ఇటీవల వచ్చిన అర్జున్ మూవీ ‘బ్లాస్ట్’ని తలపిస్తుంది. కానీ, ఆ తర్వాత ఆ సినిమాకీ, ఈ సినిమాకీ పెద్దగా పోలికలుండవ్. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్టయ్యింది. డంపుల్ హయాతీ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ‘నారాయణమ్మ’ పాట ధియేటర్లలో విజిల్స్ వేయిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ బాగుంది.

ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్ కామెడీ, వెంకటేష్ - శ్రీనిధి శెట్టి పర్‌ఫామెన్స్, సత్య కామెడీ, ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్..

మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని కథ, తేలిపోయిన క్లైమాక్స్ 

చివరిగా:
‘ఆదర్శ కుటంబం’ లాజిక్స్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా చూస్తే, నవ్వులు పంచే కుటుంబమే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com