ఖతార్ నేషనల్ థియేటర్ రెనోవేషన్ పనులు ప్రారంభం..!!

- October 30, 2026 , by Maagulf
ఖతార్ నేషనల్ థియేటర్ రెనోవేషన్ పనులు ప్రారంభం..!!

దోహా: ఖతార్‌లోని ప్రముఖ సాంస్కృతిక కట్టడమైన నేషనల్ థియేటర్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రజా పనుల సంస్థ అష్ఘల్ (Ashghal) ప్రకటించింది. థియేటర్‌లోని సౌకర్యాలను ఆధునికీకరించడం, సాంకేతిక సామర్థ్యాలను పెంచడం, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలని తెలిపారు. అదే సమయంలో థియేటర్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన నిర్మాణ శైలిని, చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను కాపాడనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా థియేటర్‌లోని కొన్ని నిర్మాణ భాగాలను తిరిగి నిర్మించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టనున్నారు. ఆడియో, వీడియో వ్యవస్థలు, వేదికపై ఉపయోగించే పరికరాలను ఆధునికీకరించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే భవనంపై నిర్వహించిన అధ్యయనాలు, పరిశీలనల్లో కొన్ని భాగాలను తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించారు. భద్రత, పర్యావరణ అనుకూలత, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూనే భవనం అసలు నిర్మాణ శైలిని, అందాన్ని కాపాడేలా పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు ఇంజినీర్ ఫైసల్ అల్ ఖహ్తానీ మాట్లాడుతూ.. దేశంలోని సాంస్కృతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భాగంగానే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వివిధ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు థియేటర్‌ను సిద్ధం చేయనున్నట్లు వివరించారు.
 
ఖతార్ సాంస్కృతిక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు అవసరమైన ఆధునిక వేదికలను సిద్ధం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా నిలవనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com