ఖతార్ రియల్ ఎస్టేట్‌లో మారుతున్న ఇన్వెస్టర్ల ధోరణి..!!

- October 31, 2026 , by Maagulf
ఖతార్ రియల్ ఎస్టేట్‌లో మారుతున్న ఇన్వెస్టర్ల ధోరణి..!!

దోహా: ఖతార్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల ఆలోచనా ధోరణి మారుతోంది. గతంలో ప్రధానంగా నివాస గృహాలు, భూములు, అపార్ట్‌మెంట్లపై దృష్టి పెట్టిన పెట్టుబడిదారులు ఇప్పుడు కమర్షియల్ కార్యాలయాలు, హాస్పిటాలిటీ, మిక్స్‌డ్ యూజ్ డెవలప్‌మెంట్ల వైపు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల ద్వారా స్థిరమైన ఆదాయం పొందడంతోపాటు రిస్క్‌ను తగ్గించుకునేందుకు వివిధ రకాల ఆస్తులతో కూడిన పోర్ట్‌ఫోలియోలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

సిటీ స్కేప్ ఖతార్ 2026లో నిర్వహించిన ‘పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్: రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ మిక్స్‌డ్ యూజ్’ అనే అంశంపై జరిగిన చర్చలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నిపుణులు ఈ అభిప్రాయాలను వెల్లడించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం, ఆదాయ వనరులను విస్తరించడం, నివాస, వాణిజ్య, రిటైల్ సదుపాయాలను ఒకే ప్రాంగణంలో అభివృద్ధి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు.

యునైటెడ్ డెవలప్‌మెంట్ కంపెనీ (UDC) కమర్షియల్ అండ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్సేన్ అక్బర్ అల్ బేకర్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండటం వల్ల మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. వివిధ రకాల ప్రాపర్టీలు ఒకదానికొకటి తోడ్పడినప్పుడు దీర్ఘకాలిక విలువ, స్థిరమైన డిమాండ్ ఏర్పడతాయని వివరించారు.

మరోవైపు ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతుండటంతో రిటైల్ రంగంలో వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయని అల్ బేకర్ తెలిపారు. పెద్ద పెద్ద దుకాణాలు, భారీ రెస్టారెంట్ల కంటే చిన్న షాపులు, కేఫ్‌లు, క్యాజువల్ డైనింగ్ కేంద్రాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఫార్మసీలు, నిత్యావసర సేవలు అందించే కేంద్రాలు కూడా రిటైల్ ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు.

ఖతార్‌లో గతంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో నివాస ఆస్తులదే ప్రధాన వాటా ఉండేదని క్వారమ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ జనరల్ మేనేజర్ ఆడమ్ స్టీవర్ట్ తెలిపారు. కుటుంబాలు ఇళ్లు, స్థలాలు, నివాస భవనాల కొనుగోలు ద్వారా సంపదను పెంచుకునేవారని చెప్పారు. అయితే ప్రస్తుతం పెట్టుబడిదారులు ఆస్తుల విలువతోపాటు వాటి ద్వారా వచ్చే ఆదాయం, ఇతర పెట్టుబడులతో పోలిస్తే వాటి పనితీరును కూడా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.

వైవిధ్యమైన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో నివాస ఆస్తులు స్థిరమైన ఆదాయాన్ని అందించగలవని, నాణ్యమైన కార్యాలయ భవనాలు రక్షణాత్మక పెట్టుబడులుగా ఉపయోగపడతాయని స్టీవర్ట్ వివరించారు. జేటీఏ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ సీఈఓ డాక్టర్ అమీర్ అలీ సలేమి జాదే మాట్లాడుతూ.. ఖతార్‌లో భూముల అభివృద్ధి, భారీ టవర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వ్యాపార కేంద్రంగా ఖతార్ మరింత అభివృద్ధి చెందుతుందని, అంతర్జాతీయ కంపెనీల రాక పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోందన్నారు.

మొత్తంగా ఖతార్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల విధానం మారుతోందని, కేవలం ఆస్తుల విలువ పెరుగుదలపైనే కాకుండా వాటి ద్వారా వచ్చే ఆదాయం, వినియోగదారుల అవసరాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారని నిపుణుల చర్చ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com