బహ్రెయిన్‌లో ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులపై కొత్త నిబంధనలు?

- October 31, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులపై కొత్త నిబంధనలు?

మనామా: బహ్రెయిన్‌లో ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సుల చెల్లుబాటును వారి రెసిడెన్సీ పర్మిట్ గడువుతో అనుసంధానించే ప్రతిపాదనపై ఆదివారం షూరా కౌన్సిల్‌లో చర్చ జరగనుంది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని షూరా కౌన్సిల్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, జాతీయ భద్రతా కమిటీ సిఫార్సు చేసింది.

ప్రస్తుతం బహ్రెయిన్‌లో డ్రైవింగ్ లైసెన్సులు ఐదేళ్లపాటు చెల్లుబాటులో ఉంటాయి. కొత్త ప్రతిపాదన ఆమోదం పొందితే, ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సుల గడువు వారి రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసినప్పుడే ముగుస్తుంది. అంటే ఒకటి లేదా రెండేళ్ల రెసిడెన్సీ ఉన్నవారు తరచూ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది.

ఈ మార్పుతో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, రోడ్లపై వాహనాల సంఖ్యను నియంత్రించవచ్చని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదనకు మద్దతుదారులు భావిస్తున్నారు. చట్టబద్ధమైన నివాస అనుమతి లేని కార్మికులు రోడ్లపై వాహనాలు నడపడాన్ని అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

అయితే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2015లో అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ నిబంధనల ప్రకారమే డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, రెన్యువల్ చేసుకోవడానికి ప్రవాసులకు చెల్లుబాటయ్యే రెసిడెన్సీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు ఈ అంశాన్ని పరిష్కరిస్తున్నందున కొత్త చట్టం అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది.

మరోవైపు, 10 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ కలిగినవారి విషయంలోనూ కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించింది. లైసెన్సుల గడువును రెసిడెన్సీతో అనుసంధానిస్తే వాటి చెల్లుబాటు విషయంలో గందరగోళం ఏర్పడటంతో పాటు, బహ్రెయిన్ పౌరుల లైసెన్సుల కంటే ప్రవాసుల లైసెన్సులు ఎక్కువ కాలం చెల్లుబాటయ్యే పరిస్థితి రావచ్చని పేర్కొంది.

లైసెన్స్ అనేది వ్యక్తి డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై వాహనం నడిపేందుకు అర్హత సాధించాడని తెలిపే పత్రం కాగా, రెసిడెన్సీ పర్మిట్ అనేది దేశంలో నివసించేందుకు ఇచ్చే అనుమతి మాత్రమేనని కమిటీ వివరించింది. ఈ రెండింటినీ అనుసంధానించడం సమంజసం కాదని అభిప్రాయపడింది.

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అవసరమైన అనుమతులు లేకుండా ప్రయాణికులను లేదా వస్తువులను డెలివరీ చేయడం వంటి ఉల్లంఘనలను అడ్డుకునేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయని కమిటీ గుర్తుచేసింది. లైసెన్స్ గడువును మార్చడం వల్ల ట్రాఫిక్ సమస్యలు లేదా అక్రమ కార్యకలాపాలు గణనీయంగా తగ్గే అవకాశం లేదని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com