దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!

- October 31, 2026 , by Maagulf
దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!

దుబాయ్: దుబాయ్‌లో నిర్వహించనున్న ‘దుబాయ్ రైడ్’ కార్యక్రమం సందర్భంగా నవంబర్ 1న మెట్రో రైళ్ల సమయాలను రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) పొడిగించింది. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. మెట్రోలో ప్రయాణించే వారు తమ నోల్ (Nol) కార్డులో కనీసం Dh30 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని RTA సూచించింది.

దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో భాగంగా నిర్వహించే ప్రధాన కార్యక్రమం ‘దుబాయ్ రైడ్’. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 29 వరకు జరిగే ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను 2017లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ప్రతిరోజూ 30 నిమిషాల వ్యాయామం చొప్పున 30 రోజుల పాటు ప్రజలను ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం దీని లక్ష్యం. గత తొమ్మిది విడతల్లో 16 మిలియన్లకు పైగా ప్రజలు పాల్గొన్నారు.

రెండు మార్గాల్లో సైక్లింగ్‌కు అవకాశం

దుబాయ్ రైడ్‌లో భాగంగా రెండు ప్రధాన సైక్లింగ్ మార్గాలను ఏర్పాటు చేశారు. 12 కిలోమీటర్ల షేక్ జాయెద్ రోడ్ మార్గం అనుభవం ఉన్న సైక్లిస్టులకు అనుకూలంగా ఉంటుంది. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, దుబాయ్ వాటర్ కెనాల్, బుర్జ్ ఖలీఫా వంటి ప్రముఖ ప్రాంతాల మీదుగా ఈ మార్గం సాగుతుంది. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, సత్వా, కోకాకోలా అరేనా, బిజినెస్ బే, లోయర్ ఫైనాన్షియల్ స్ట్రీట్ ప్రాంతాల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.

ఇక 4 కిలోమీటర్ల డౌన్‌టౌన్ ఫ్యామిలీ రూట్ కుటుంబాలు, చిన్నపిల్లలు, అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుంది. దుబాయ్ మాల్, దుబాయ్ ఒపెరా, బుర్జ్ ఖలీఫా పరిసరాల్లో ఈ మార్గం ఉంటుంది. ఇది పోటీ రేసు కాదని, పాల్గొనేవారు గంటకు 25 కిలోమీటర్ల వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com