ఖతార్‌లో ఉద్యోగం మానేస్తే.. ఫైనల్ సెటిల్‌మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారు?

- November 01, 2026 , by Maagulf
ఖతార్‌లో ఉద్యోగం మానేస్తే.. ఫైనల్ సెటిల్‌మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారు?

ఖతార్‌లో ఉద్యోగం మానేస్తే.. ఫైనల్ సెటిల్‌మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారు?

దోహా: ఖతార్‌లో ఉద్యోగం మానేసిన లేదా ఉద్యోగ ఒప్పందం ముగిసిన కార్మికులకు రావాల్సిన బకాయి జీతాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను చెల్లించేందుకు యజమానులకు కార్మిక చట్టం నిర్దిష్ట గడువు విధించింది. ఈ గడువులోగా చెల్లింపులు చేయకపోతే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఖతార్ కార్మిక చట్టం 2004లోని లా నంబర్ 14, ఆర్టికల్ 67 ప్రకారం, ఉద్యోగ ఒప్పందం ఏ కారణంతో ముగిసినా కార్మికుడికి రావాల్సిన జీతాలు, ఇతర బకాయిలను ఒప్పందం ముగిసిన మరుసటి పని దినం ముగిసేలోగా యజమాని చెల్లించాలి. అయితే, ఆర్టికల్ 49 ప్రకారం ఇవ్వాల్సిన నోటీసు వ్యవధిని పాటించకుండా కార్మికుడు ఉద్యోగాన్ని వదిలివెళ్తే మాత్రం, అతను వెళ్లిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా అన్ని బకాయిలను చెల్లించాలి.

నోటీసు వ్యవధి ఎంత?

ఖతార్ కార్మిక చట్టంలోని ఆర్టికల్ 49 ప్రకారం, ప్రొబేషన్ పీరియడ్ ముగిసిన తర్వాత యజమాని లేదా కార్మికుడు ఉద్యోగ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. అయితే ముందుగా రాతపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. ఉద్యోగంలో చేరిన మొదటి రెండేళ్లలో కనీసం ఒక నెల ముందుగా నోటీసు ఇవ్వాలి. రెండేళ్లు దాటిన తర్వాత రెండు నెలల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు యజమాని, ఉద్యోగి ఇద్దరికీ వర్తిస్తాయి. నోటీసు వ్యవధిని పాటించకుండా ఉద్యోగ ఒప్పందాన్ని రద్దు చేస్తే, నోటీసు కాలానికి లేదా మిగిలిన కాలానికి సమానమైన ప్రాథమిక వేతనాన్ని పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిహారం, కార్మికుడికి రావాల్సిన ఫైనల్ సెటిల్‌మెంట్‌కు అదనం. ఈ రెండింటినీ వేర్వేరుగా పరిగణించాలి. అలాగే, నిబంధనల ప్రకారం నోటీసు ఇవ్వకుండా ఖతార్‌ను విడిచిపెట్టి వెళ్లిన ప్రవాస కార్మికుడికి, దేశం విడిచిన తేదీ నుంచి ఏడాది పాటు కొత్త వర్క్ పర్మిట్ మంజూరు చేయరాదని ఆర్టికల్ 49 పేర్కొంటోంది.

ఫైనల్ సెటిల్‌మెంట్ ఆలస్యమైతే శిక్షలు ఏమిటి?

ఆర్టికల్ 145 ప్రకారం, ఆర్టికల్ 67 నిబంధనలను ఉల్లంఘించిన యజమానులకు గరిష్ఠంగా ఒక నెల వరకు జైలు శిక్ష లేదా QR2,000 నుంచి QR6,000 వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది. అయితే, ఈ శిక్షలు కోర్టు విధించేవి. ప్రతి ఆలస్య చెల్లింపునకు ఆటోమేటిక్‌గా జరిమానా పడుతుందని భావించకూడదు. సాధారణంగా ఉద్యోగ ఒప్పందం ముగిసిన మరుసటి పని దినం ముగిసేలోగా ఫైనల్ సెటిల్‌మెంట్ చెల్లించాలి. ఆర్టికల్ 49 ప్రకారం అవసరమైన నోటీసు ఇవ్వకుండా కార్మికుడు వెళ్లిపోయిన ప్రత్యేక పరిస్థితిలో మాత్రమే ఏడు రోజుల గడువు వర్తిస్తుందని నిపుణులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com