ఒమన్‌లో జాతీయ జెండాను అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష..!!

- November 01, 2026 , by Maagulf
ఒమన్‌లో జాతీయ జెండాను అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష..!!

మస్కట్: ఒమన్ జాతీయ జెండా, ప్రభుత్వ చిహ్నం, జాతీయ గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించే వారికి కఠిన శిక్షలు విధించేలా ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి కనీసం 3 నెలల నుంచి గరిష్ఠంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ రాయల్ డిక్రీ నంబర్ 99/2026ను జారీ చేశారు. రాష్ట్ర జెండా, ప్రభుత్వ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన చట్టంలోని కొన్ని నిబంధనలను ఈ డిక్రీ ద్వారా సవరించారు.

కొత్త నిబంధనల ప్రకారం జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా కిందికి దించడం, ధ్వంసం చేయడం లేదా ఇతర చర్యల ద్వారా దాని పట్ల ద్వేషం, అవమాన భావాన్ని వ్యక్తం చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇదే శిక్ష జాతీయ గీతాన్ని మాటల ద్వారా, రాతపూర్వకంగా, సంజ్ఞల ద్వారా అవమానించినా, దాని స్వరూపాన్ని వక్రీకరించినా వర్తిస్తుంది. అంతేకాకుండా జాతీయ జెండా కొలతలు, ప్రమాణాలు, ప్రభుత్వ చిహ్నానికి సంబంధించిన వివరాలతో కూడిన చట్టంలోని అనుబంధం 1, 2లను కూడా సవరించారు.

మరోవైపు, సమర్థ అధికారి నిర్ణయించే ఇతర సందర్భాలు, ప్రదేశాలు, కార్యక్రమాల్లోనూ జాతీయ గీతాన్ని ఆలపించేందుకు అవకాశం కల్పించారు. అయితే ఇందుకు మంత్రిమండలి ఆమోదం తప్పనిసరి. ఈ సవరణలకు విరుద్ధంగా ఉన్న పాత నిబంధనలను రద్దు చేస్తూ డిక్రీలో పేర్కొన్నారు. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన మరుసటి రోజు నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com