ఆహార నిల్వలు పెంచుకోవాలి..కువైట్ సహకార సంఘాలకు ఆదేశం..!!

- November 05, 2026 , by Maagulf
ఆహార నిల్వలు పెంచుకోవాలి..కువైట్ సహకార సంఘాలకు ఆదేశం..!!
కువైట్: ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలు (కోఆపరేటివ్ సొసైటీలు) తగినంత ఆహార నిల్వలు, నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆహార పదార్థాల గడువు తేదీలను పరిశీలించడంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలను అమలు చేయాలని సూచించింది. సామాజిక వ్యవహారాల మంత్రి డాక్టర్ అమ్తాల్ అల్-హువైలా ఈ మేరకు మంత్రిత్వ శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 
 
సహకార సంఘాలు, కేంద్ర మార్కెట్లు, వాటి అనుబంధ శాఖలు ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే దేశంలోని ఆరు గవర్నరేట్ల పరిధిలో పాఠశాలల్లో గుర్తించిన 95 అత్యవసర ఆశ్రయ కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్‌తో జరిగిన సమన్వయ సమావేశం అనంతరం మరో మూడు ఆశ్రయ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
 
ప్రతి సహకార సంఘం సుమారు 400 మందికి సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు, అల్పాహారాలు, ఇతర నిత్యావసర వస్తువులను నిల్వ చేయాలని సూచించారు. రోజుకు మూడు పూటల భోజనం అందించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఆశ్రయ కేంద్రాల్లో అవసరమైన పరుపులు, దుప్పట్లు, ఇతర వసతి సదుపాయాలను స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయం చేసి అందించనున్నాయి.
 
అత్యవసర పరిస్థితులు తలెత్తినా ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరాలో అంతరాయం కలగకుండా చూడటం, మార్కెట్లలో ధరలు, సరఫరా స్థిరత్వాన్ని కాపాడటం, అవసరమైన సమయంలో వేగంగా స్పందించడం లక్ష్యంగా ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు కథనం పేర్కొంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com