యూఏఈలో త్వరలో ఎగిరే కార్ల సందడి..!!

- November 05, 2026 , by Maagulf
యూఏఈలో త్వరలో ఎగిరే కార్ల సందడి..!!

దుబాయ్: యూఏఈలో నివసించే వారికి త్వరలో ఎగిరే కార్లను సొంతం చేసుకునే అవకాశం రానుంది. రోడ్డుపై సాధారణ కారులా నడపడంతో పాటు, అవసరమైనప్పుడు విమానంలా గాల్లో ప్రయాణించే సరికొత్త వాహనాన్ని చైనా కంపెనీ ఆరిడ్జ్ (Aridge) మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఎక్స్‌పెంగ్ (XPENG) సంస్థకు చెందిన ఈ వినూత్న వాహనానికి ‘ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్’ (Land Aircraft Carrier) అని పేరు పెట్టారు. నవంబర్ 2న దుబాయ్‌లోని సోఫిటెల్ ద పామ్‌లో జరిగిన XPENG బ్రాండ్ నైట్, న్యూ ప్రొడక్ట్ లాంచ్ కార్యక్రమంలో ఈ ఫ్లయింగ్ కార్ నమూనాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆరిడ్జ్ సహ వ్యవస్థాపకుడు, వైస్ ప్రెసిడెంట్, XPENG డిజైన్ జనరల్ మేనేజర్ టాన్ వాంగ్ ఈ వాహనం ప్రత్యేకతలను వివరించారు.

రెండు భాగాలుగా ఫ్లయింగ్ కార్

ఈ వాహనం రెండు ప్రధాన భాగాలతో రూపొందించారు. ఆరు చక్రాలతో ఉండే రోడ్డు వాహనంలో వెనుక భాగంలో రెండు సీట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ విమానాన్ని అమర్చుతారు. ఇది ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) సాంకేతికతతో పనిచేస్తుంది. యజమానులు ముందుగా కారును నడుపుకుంటూ నిర్ణీత విమాన ప్రయాణ ప్రాంతానికి చేరుకోవచ్చు. అక్కడ ఒక్క టచ్‌తోనే వెనుక భాగంలోని కంపార్ట్‌మెంట్ తెరుచుకుని విమానం బయటకు వస్తుంది. విమానాన్ని వాహనం నుంచి వేరు చేయడానికి, తిరిగి అనుసంధానించడానికి ప్రత్యేక ఆటోమేటెడ్ వ్యవస్థను రూపొందించారు.

ఈ ప్రక్రియ కోసం కనీసం ఏడు సిస్టమ్స్, 1,000కు పైగా విడిభాగాలను ఉపయోగించినట్లు టాన్ వాంగ్ తెలిపారు. విమాన ప్రయాణం పూర్తయిన తర్వాత కెమెరాల సహాయంతో కారు విమానాన్ని గుర్తించి దాని వద్దకు చేరుకుంటుంది. ప్రత్యేక సస్పెన్షన్ వ్యవస్థ ద్వారా రెండు భాగాలను సరైన స్థాయిలోకి తీసుకొస్తుంది. అనంతరం విమానాన్ని తిరిగి కారులోకి చేర్చే ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకు సుమారు 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది.

వ్యక్తిగత వినియోగదారులే లక్ష్యం

ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఎయిర్ ట్యాక్సీలు ప్రధానంగా వాణిజ్య ప్రయాణాల కోసం రూపొందుతుండగా, ఆరిడ్జ్ మాత్రం వ్యక్తిగత వినియోగదారులకు ఫ్లయింగ్ కార్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విమానం కోసం ప్రత్యేకంగా హ్యాంగర్ అద్దెకు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, దానిని సొంతంగా భద్రపరుచుకోవచ్చు. అవసరమైన పార్కింగ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటి వద్ద కూడా వాహనాన్ని పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వాహనానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,000 ప్రీ-ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిలో దాదాపు 600 ఆర్డర్లు గల్ఫ్ దేశాల (GCC) నుంచి వచ్చినట్లు టాన్ వాంగ్ తెలిపారు.

లైసెన్స్, అనుమతులు తప్పనిసరి

ఫ్లయింగ్ కారును కొనుగోలు చేసినంత మాత్రాన ఎక్కడపడితే అక్కడి నుంచి విమానంలా ఎగరడానికి అనుమతి ఉండదు. ఇందుకు అవసరమైన విమానయాన అనుమతులు, పైలట్ నిర్వహణ నిబంధనలు, ప్రయాణ ప్రాంతాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ముందుగా చైనాకు చెందిన సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (CAAC) నుంచి విమానానికి టైప్ సర్టిఫికేషన్ పొందాలని ఆరిడ్జ్ లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) నుంచి గుర్తింపు, అవసరమైన అనుమతులు పొందేందుకు ప్రయత్నించనుంది. అప్పుడే యూఏఈలో చట్టబద్ధంగా విమానాన్ని నడిపేందుకు మార్గం ఏర్పడుతుంది.

ఎక్కడి నుంచి ఎగరడానికి అవకాశం?

ఈ ఫ్లయింగ్ కార్లను ఏ బహిరంగ ప్రదేశం నుంచైనా టేకాఫ్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. విమాన ప్రయాణానికి అధికారికంగా అనుమతించిన ప్రాంతాలు, గగనతల నిబంధనలు, అవసరమైన మౌలిక సదుపాయాలు కీలకం కానున్నాయి.

ఈ సాంకేతికతను పరీక్షించేందుకు రస్ అల్ ఖైమా ప్రభుత్వంతో ఆరిడ్జ్ ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ విమానయాన అధికారుల పర్యవేక్షణలో రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే జాబీ (Joby) ఎయిర్ ట్యాక్సీల కోసం నిర్మిస్తున్న స్కైపోర్ట్ వెర్టిపోర్ట్‌లు, ఇప్పటికే ఉన్న హెలికాప్టర్ ల్యాండింగ్ కేంద్రాలను కూడా వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఫ్లయింగ్ కార్లకు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే యూఏఈలో వ్యక్తిగత ప్రయాణ విధానంలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే వాహనం వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చే తేదీ, ధర, వ్యక్తిగతంగా విమానం నడిపేందుకు అవసరమైన లైసెన్స్ నిబంధనలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com