రెస్టారెంట్లు, హోటళ్లకు BD3,000 వరకు జరిమానా ప్రతిపాదన..!!

- November 06, 2026 , by Maagulf
రెస్టారెంట్లు, హోటళ్లకు BD3,000 వరకు జరిమానా ప్రతిపాదన..!!

మనామా: రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాలకు సంబంధించిన క్యాలరీల వివరాలు, అలర్జీ హెచ్చరికలను మెనూలో వెల్లడించకపోతే BD3,000 వరకు జరిమానా విధించేలా బహ్రెయిన్‌లో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వినియోగదారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఐదుగురు షూరా కౌన్సిల్ సభ్యులు ఈ మేరకు ప్రజారోగ్య చట్టానికి సవరణలు ప్రతిపాదించారు. డాక్టర్ జమీల అల్ సల్మాన్ ఈ ప్రతిపాదనకు నేతృత్వం వహించారు.

ఈ ప్రతిపాదన ప్రకారం రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ షాపులు, ఆహారాన్ని విక్రయించే ఇతర సంస్థలు తమ మెనూలో ప్రతి ఆహార పదార్థానికి సంబంధించిన క్యాలరీల వివరాలు, అలర్జీ కలిగించే పదార్థాల సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. కస్టమర్లు ఆర్డర్ ఇచ్చే ముందే ఈ వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించాలి. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎవరికీ ఆరోగ్యపరమైన నష్టం జరగకపోయినా జరిమానా విధించేలా ప్రతిపాదించారు.

2018 నాటి పబ్లిక్ హెల్త్ లా నంబర్ 34కు ఈ సవరణలు చేయాలని సభ్యులు కోరుతున్నారు. క్యాలరీలను ఎలా లెక్కించాలి, అలర్జీ కలిగించే పదార్థాలను ఎలా గుర్తించాలి, ఆ వివరాలను మెనూలో ఏ విధంగా ప్రదర్శించాలనే అంశాలపై ఆరోగ్య శాఖ అధికారులకు నిర్ణయాధికారం కల్పించాలని ప్రతిపాదించారు. అలాగే తప్పనిసరిగా వెల్లడించాల్సిన అలర్జీ కారకాల జాబితాను సంబంధిత మంత్రి నిర్ణయించేలా సూచించారు.

ఆహారంలో ఉండే కొన్ని పదార్థాలు కొందరిలో తీవ్రమైన అలర్జీకి కారణమవుతాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితి అయిన అనాఫిలాక్సిస్‌కు దారితీస్తాయని డాక్టర్ జమీల అల్ సల్మాన్ పేర్కొన్నారు. క్యాలరీల వివరాలు అందుబాటులో ఉంటే వినియోగదారులు తమ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకోవచ్చని తెలిపారు.

కాగా, క్యాలరీల వివరాలు, అలర్జీ హెచ్చరికలకు సంబంధించి బహ్రెయిన్ ఇప్పటికే రెండు గల్ఫ్ ప్రమాణాలను ఆమోదించింది. 2024లో GSO 2604:2024 ప్రమాణం ద్వారా రెస్టారెంట్ల మెనూలో క్యాలరీల వివరాలకు సంబంధించిన మార్గదర్శకాలను స్వీకరించింది. 2025లో GSO 2605:2024 ప్రమాణం ద్వారా ఆహార అలర్జీల హెచ్చరికలకు సంబంధించిన నిబంధనలను ఆమోదించింది. అయితే ఈ ప్రమాణాలను ఆమోదించినంత మాత్రాన అవి చట్టబద్ధంగా తప్పనిసరి కావని షూరా సభ్యులు గుర్తుచేశారు.

ప్రస్తుత చట్టంలోని ఆర్టికల్ 107(b) ప్రకారం కొన్ని ఆరోగ్య నిబంధనల ఉల్లంఘనలకు శిక్ష విధించాలంటే ప్రజారోగ్యం, భద్రత లేదా పర్యావరణానికి నష్టం జరిగినట్లు నిరూపించాల్సి ఉంటుంది. అయితే మెనూలో క్యాలరీల వివరాలు లేదా అలర్జీ హెచ్చరికలు లేకపోవడం వల్ల నేరుగా నష్టం జరిగినట్లు నిరూపించడం కష్టమవుతోంది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆర్టికల్ 115లోనూ మార్పులు ప్రతిపాదించారు. దీని ప్రకారం క్యాలరీలు, అలర్జీ వివరాలను వెల్లడించని వ్యాపార సంస్థలపై ఎలాంటి ఆరోగ్య నష్టం జరిగినట్లు నిరూపించకుండానే జరిమానా విధించవచ్చు. ఇప్పటికే తనిఖీ అధికారులకు అవసరమైన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు చూపించకపోతే జరిమానా విధించే నిబంధనల్లోకి ఈ ఉల్లంఘనలను కూడా చేర్చాలని ప్రతిపాదించారు. గరిష్ఠంగా BD3,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

ఇదే సమయంలో నిబంధనలు పాటించని సంస్థలకు ముందుగా హెచ్చరికలు జారీ చేయడం, లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించడం వంటి ప్రస్తుత విధానాలు కొనసాగుతాయి. గత ఆగస్టులో హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా రెస్టారెంట్ల ఆహార పదార్థాల్లో క్యాలరీల వివరాలను ప్రదర్శించే విధానాన్ని అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది.

చిన్న ఫుడ్ షాపుల నుంచి పెద్ద హోటల్ చైన్ల వరకు అందరూ ఈ నిబంధనలను సులభంగా పాటించేలా విధివిధానాలు రూపొందించాలని ప్రతిపాదకులు సూచించారు. ప్రతి వంటకానికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా గుర్తింపు పొందిన పోషకాహార పట్టికలు, అందుబాటులో ఉన్న ఇతర సాధనాల ద్వారా క్యాలరీలను లెక్కించే వెసులుబాటు కల్పించాలని కోరారు. వ్యాపారాల స్థాయిని బట్టి నిబంధనలు అమలు చేసేలా చూడాలని, చిన్న సంస్థలపై అనవసరమైన ఖర్చులు, పత్రాల భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com