యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అభివృద్ధి పనులను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

- November 06, 2026 , by Maagulf
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అభివృద్ధి పనులను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

ఏప్రిల్ 2027 నాటికి నిర్మాణ పనుల పూర్తి లక్ష్యం.. విద్యార్థుల సంఖ్య 345 నుంచి 720కి పెంపు

హైదరాబాద్: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS) అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో భాగంగా తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ఈ రోజు పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అకడమిక్ బ్లాక్-1తో పాటు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా రానున్న విద్యా సంవత్సరం నాటికి, అంటే 2027 ఏప్రిల్ చివరి నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉందని డీజీపీ తెలిపారు. ఈ పనులు పూర్తయితే పాఠశాలలో ప్రస్తుతం ఉన్న 345 మంది విద్యార్థుల సంఖ్యను 720కి పెంచేందుకు అవకాశం కలుగుతుందని వెల్లడించారు. అదనంగా చేపట్టాల్సిన మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా ఆయన ఆమోదం తెలిపారు.

వివిధ కమిటీల పనుల పై సమీక్ష

పాఠశాలకు సంబంధించిన అకడమిక్, ప్రొక్యూర్‌మెంట్, మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) తదితర కమిటీల పనుల పురోగతిని డీజీపీ సమీక్షించారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీల అమలు, చేపట్టిన పనుల స్థితిగతులను పరిశీలించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమగ్ర విద్యకు ప్రాధాన్యం

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ క్యాంపస్ విద్యార్థులకు సమగ్ర అభ్యాస వాతావరణాన్ని అందించేలా తీర్చిదిద్దాలని డీజీపీ అధికారులకు సూచించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలు, క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం, విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే పాఠ్యప్రణాళిక పాఠశాల ప్రత్యేకతగా నిలవాలని ఆకాంక్షించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవసరమైన అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పాఠశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com