2030 నాటికి జీసీసీ రైల్వే నెట్వర్క్.. బహ్రెయిన్ సమీక్ష..!!
- November 06, 2026
మనామా: గల్ఫ్ దేశాలను అనుసంధానించే భారీ రైల్వే ప్రాజెక్టులో భాగస్వామ్యం దిశగా బహ్రెయిన్ అడుగులు వేస్తోంది. రైల్వే కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన చట్టంపై పార్లమెంటరీ కమిటీ మరింత లోతుగా పరిశీలన చేపట్టింది.
గల్ఫ్ దేశాల మధ్య రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేసే జీసీసీ (GCC) రైల్వే నెట్‌వర్క్‌లో చేరేందుకు బహ్రెయిన్ సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో రైల్వే కార్యకలాపాలను నియంత్రించే చట్టంపై బహ్రెయిన్ పార్లమెంటు ప్రతినిధుల మండలి (Council of Representatives) సమీక్ష కొనసాగిస్తోంది.
బహ్రెయిన్‌లో రైల్వే నిర్మాణం, నిర్వహణ, భద్రత తదితర అంశాలను నియంత్రించేందుకు రూపొందించిన డిక్రీ-లా నంబర్ 42 ఆఫ్ 2026పై నవంబర్ 4న పబ్లిక్ యుటిలిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్ కమిటీ చర్చించింది. ఈ సమావేశానికి రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. ఎంపీ హిషామ్ అల్ అవధీ సమావేశానికి అధ్యక్షత వహించారు. చర్చల అనంతరం చట్టంపై మరింత అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించింది.
గత సెప్టెంబర్‌లో జారీ చేసిన ఈ చట్టం రైల్వే నిర్మాణం, కార్యకలాపాలు, నిర్వహణ, భద్రత, లైసెన్సుల జారీకి సంబంధించిన నియంత్రణలను నిర్దేశిస్తుంది. పొరుగున ఉన్న జీసీసీ దేశాల రైల్వే నెట్‌వర్క్‌లతో అనుసంధానానికి కూడా ఇది మార్గం సుగమం చేయనుంది. రైల్వే రంగం అభివృద్ధి బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థను విస్తరించడంతో పాటు ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని పెంచుతుందని కమిటీ అభిప్రాయపడింది. అలాగే పెట్టుబడులు, లాజిస్టిక్స్ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొంది.
2,000 కిలోమీటర్లకు పైగా రైల్వే నెట్వర్క్
కువైట్ నుంచి ఒమన్ వరకు గల్ఫ్ దేశాలను అనుసంధానించేలా 2,000 కిలోమీటర్లకు పైగా విస్తరించే జీసీసీ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇందులో బహ్రెయిన్ కూడా భాగస్వామిగా ఉండనుంది. ఈ ప్రాంతీయ రైల్వే నెట్‌వర్క్‌ను 2030 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సభ్య దేశాల్లో పనుల పురోగతిపై ఈ గడువు ఆధారపడి ఉంటుంది.
ఇదిలా ఉండగా, నవంబర్ 2న జరిగిన సమావేశంలో జీసీసీ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన సాధారణ ఒప్పందాన్ని ఆమోదించే ముసాయిదా చట్టానికి బహ్రెయిన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
- తెలంగాణ పోలీసుల ఆరోగ్యానికి ‘ఫిట్‌కాప్’.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక చర్యలు
- 5G-A ఇంటర్నెట్ వేగంలో గల్ఫ్‌లోనే కువైట్ టాప్..!!
- 2030 నాటికి జీసీసీ రైల్వే నెట్వర్క్.. బహ్రెయిన్ సమీక్ష..!!
- ఒమన్‌లో భారీగా సిగరెట్లు, నమిలే పొగాకు పట్టివేత..!!
- గ్లోబల్ టెక్ హబ్‌గా దోహా.. రెండోసారి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026..!!
- యూఏఈ పిల్లల్లో తగ్గుతున్న చేతిరాత నైపుణ్యం..!!
- 122 సాంకేతిక రంగాలకు సౌదీ నాణ్యత పరీక్షల విస్తరణ..!!
- ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అభివృద్ధి పనులను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్







