బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులు పెంపు..!!

- November 07, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులు పెంపు..!!

మనామా: బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులను మూడు దశల్లో గరిష్ఠంగా 50 శాతం పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన కొన్ని వృత్తుల్లో కనీసం 70 శాతం ఉద్యోగాలు బహ్రెయిన్ పౌరులకే కేటాయించాలన్న ప్రతిపాదనపైనా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. స్థానిక నిరుద్యోగులకు, ముఖ్యంగా యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన యువతకు ఉద్యోగావకాశాలు పెంచే లక్ష్యంతో ఎంపీ డాక్టర్ మునీర్ సురూర్ ఈ ప్రతిపాదనను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీనికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

ప్రతిపాదన ప్రకారం ఎంపిక చేసిన వృత్తుల్లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులను మొదటి ఏడాది 20 శాతం, రెండో ఏడాది 35 శాతం, మూడో ఏడాది 50 శాతం పెంచాలి. అంతేకాకుండా ఆయా రంగాల్లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో కనీసం 70 శాతం మంది బహ్రెయిన్ పౌరులే ఉండేలా యజమానులు చర్యలు తీసుకోవాలి. ఈ విధానం అమలైతే స్థానికంగా అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుందని, గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం తగ్గడంతో పాటు కుటుంబ ఆదాయాలు, కొనుగోలు శక్తి మెరుగుపడతాయని ప్రతిపాదకుడు అభిప్రాయపడ్డారు.

అయితే వర్క్ పర్మిట్ ఫీజులను సాధారణంగా పెంచే విధానానికి, నిర్దిష్ట వృత్తుల్లో మాత్రమే అదనపు ఫీజులు విధించే ప్రతిపాదనకు మధ్య వ్యత్యాసం ఉందని ప్రభుత్వం పేర్కొంది. 2006 నాటి లేబర్ మార్కెట్ రెగ్యులేషన్ లా నంబర్ 19 ప్రకారం ఫీజుల పెంపు సూత్రాన్ని సమర్థించినప్పటికీ, వృత్తులవారీగా ఫీజులు పెంచడం, 70 శాతం స్థానిక ఉద్యోగుల నిబంధన విధించడంపై మరింత అధ్యయనం అవసరమని స్పష్టం చేసింది..

బహ్రెయిన్ పౌరులకు ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ విధానం కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం 2023–2026 ప్రభుత్వ కార్యక్రమం, జాతీయ కార్మిక మార్కెట్ ప్రణాళిక, ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికల ద్వారా శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, మెరుగైన వేతనాలతో కూడిన ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com