ఒమన్ సముద్రంలో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- November 09, 2026
అబుధాబి: ఒమన్ సముద్రంలో కార్గో నౌకలో అగ్నిప్రమాదం సంభవించడంతో అందులో ఉన్న 22 మంది సిబ్బందిని యూఏఈ నేషనల్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. కోస్ట్ గార్డ్‌కు నౌకలోని సిబ్బంది నుంచి అగ్నిప్రమాదంపై సమాచారం అందడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ప్రత్యేక రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నౌకను గుర్తించాయి. అనంతరం అందులో ఉన్న 22 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. వారికి అవసరమైన ప్రథమ చికిత్స అందించిన తర్వాత సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు నేషనల్ గార్డ్ వెల్లడించింది. నౌకలో ఉన్న వారంతా అరబ్ దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
గత నెలలోనూ 22 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్
గత నెలలో అరేబియన్ గల్ఫ్‌లో మరో చమురు ట్యాంకర్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు కూడా యూఏఈ కోస్ట్ గార్డ్ 22 మంది సిబ్బందిని రక్షించింది. ఈ ఘటనలో MT GEM No. 2 అనే నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు మరుసటి రోజు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది.
2025లోనూ పలు రెస్క్యూ ఆపరేషన్లు
2025 జూలైలో ఎర్ర సముద్రంలో బ్రిటన్ జెండాతో ప్రయాణిస్తున్న Magic Seas నౌకపై దాడి జరిగినప్పుడు అందులోని 22 మందిని యూఏఈ రక్షించింది. సముద్ర పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో సిబ్బంది నౌకను విడిచిపెట్టాల్సి వచ్చింది. అబుధాబి పోర్ట్స్ గ్రూప్ నిర్వహణలోని Safa Breeze నౌక సహాయక చర్యలు చేపట్టి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఈ దాడికి యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు బాధ్యత వహించినట్లు ప్రకటించారు.
అదే ఏడాది జూన్‌లో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో యూఏఈ తీరానికి 24 నాటికల్ మైళ్ల దూరంలో Adalynn చమురు ట్యాంకర్ మరో నౌకను ఢీకొన్న ఘటనలో 24 మంది సిబ్బందిని యూఏఈ రక్షించింది. వారందరినీ సురక్షితంగా ఖోర్ ఫక్కాన్ పోర్టుకు తరలించారు. ఈ ఘటనకు భద్రతాపరమైన కారణాలు లేవని బ్రిటన్‌కు చెందిన సముద్ర భద్రతా సంస్థ Ambrey తెలిపింది.
అంతకుముందు 2025 మేలో యూఏఈ తీరంలో మునిగిపోతున్న పిక్నిక్ బోటు నుంచి 13 మందిని నేషనల్ గార్డ్ రక్షించింది. బోటు నుంచి అత్యవసర సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. బోటులో యూఏఈ పౌరులతో పాటు ఇతర దేశాల నివాసితులు కూడా ఉన్నారు. సముద్ర ప్రమాదాల సమయంలో వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడటంలో యూఏఈ కోస్ట్ గార్డ్, నేషనల్ గార్డ్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్తగా మరో రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు..!!
- అల్ దఖిలియాలో OMR103 మిలియన్లతో రోడ్ల ప్రాజెక్టులు..!!
- ఒమన్ సముద్రంలో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- కువైట్‌లో ‘లులూ వాలీ దీపావళి 2026’ వేడుకలు..!!
- దుబాయ్ నుంచి మనీలాకు Dh1కే విమాన టికెట్..!!
- సౌదీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల్లో సౌదీకరణ మరింత కఠినతరం..!!
- GCC దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం..!!
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు







