అల్ దఖిలియాలో OMR103 మిలియన్లతో రోడ్ల ప్రాజెక్టులు..!!
- November 09, 2026
ఇజ్కీ: ఒమన్‌లోని అల్ దఖిలియా గవర్నరేట్ పరిధిలో రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. మొత్తం OMR103 మిలియన్లకు పైగా వ్యయంతో పలు రోడ్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతు పనులు చేపట్టారు. నివాస ప్రాంతాలు, సేవా కేంద్రాలు, వాణిజ్య, పర్యాటక ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా గవర్నరేట్ ఆధ్వర్యంలో వివిధ విలాయత్‌లలో OMR22.2 మిలియన్లకు పైగా ఖర్చుతో పనులు చేపట్టగా, రవాణా, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సుమారు OMR81.6 మిలియన్ల విలువైన పనులు కొనసాగుతున్నాయి. అంతర్గత రహదారుల నిర్మాణం, ప్రధాన రహదారుల విస్తరణ, పర్వత ప్రాంత రోడ్ల పునరుద్ధరణ, విలాయత్ల ప్రవేశ మార్గాల అభివృద్ధి, రోడ్ల మరమ్మతులు, రక్షణ పనులు, వాడీ ప్రాంతాల్లో వరద నీటి పారుదల వ్యవస్థల మెరుగుదల వంటివి ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి.
అల్ దఖిలియా గవర్నర్ షేక్ హిలాల్ బిన్ సయీద్ అల్ హజ్రీ మాట్లాడుతూ.. గవర్నరేట్ అభివృద్ధి వ్యూహంలో రహదారుల విస్తరణ కీలక భాగమని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా అందుబాటులోకి రావడంతోపాటు విలాయత్ల మధ్య రాకపోకలు మెరుగుపడతాయని, ఆర్థిక, పెట్టుబడి అవకాశాలకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలు, ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాధాన్యతల ఆధారంగా ప్రాజెక్టులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా పనుల నాణ్యత, నిధుల సమర్థ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.
వివిధ విలాయత్‌లలో అభివృద్ధి పనులు
నిజ్వాలో 44 కిలోమీటర్ల మేర అంతర్గత రహదారుల నిర్మాణానికి OMR3.3 మిలియన్లు కేటాయించారు. సెప్టెంబర్ చివరి నాటికి వేర్వేరు ప్యాకేజీల్లో పనులు 87 శాతం, 79 శాతం పూర్తయ్యాయి. నిజ్వా సెంట్రల్ మార్కెట్ వద్ద అదనపు ఎగ్జిట్ మార్గం, పార్కింగ్ సౌకర్యాల నిర్మాణం కూడా కొనసాగుతోంది. ఈ పనులు 33 శాతం పూర్తయ్యాయి.
బహ్లాలో 18 కిలోమీటర్ల మేర అంతర్గత రోడ్ల నిర్మాణానికి OMR1 మిలియన్‌కు పైగా ఖర్చు చేస్తున్నారు. కొన్ని రోడ్ల పనులు 99 శాతం, మరికొన్ని 50 శాతం పూర్తయ్యాయి. జబ్రీన్, బస్యా ప్రవేశ మార్గాల అభివృద్ధికి OMR744,000కు పైగా ఖర్చుతో పనులు చేపట్టగా, ఇవి 45 శాతం పూర్తయ్యాయి. జబ్రీన్ కోట వద్ద పార్కింగ్ ప్రాంతాల అభివృద్ధి, సలూత్ పురావస్తు కేంద్రానికి వెళ్లే రహదారికి లైటింగ్ ఏర్పాటు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.
మనాలో 10 కిలోమీటర్ల మేర అంతర్గత రహదారుల పనులు సుమారు 85 శాతం పూర్తయ్యాయి. అల్ హమ్రాలో రెండో విడత అంతర్గత రోడ్ల ప్రాజెక్టు కింద 19 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు. OMR3.5 మిలియన్లకు పైగా వ్యయంతో జరుగుతున్న ఈ పనులు 91 శాతం పూర్తయ్యాయి. వాడీ ఘుల్ రోడ్డు, వాణిజ్య ప్రాంతం రహదారుల విస్తరణకు సంబంధించిన కన్సల్టెన్సీ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నారు.
ఇజ్కీలో షఫా, అల్ అఖీల్, అల్ ఖురైసా ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల మేర అంతర్గత రహదారుల అభివృద్ధికి OMR1.2 మిలియన్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. పనులు సుమారు 70 శాతం పూర్తయ్యాయి. సమైల్‌లో మొదటి దశలో 13 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి OMR2.2 మిలియన్లకు పైగా కేటాయించారు. ఈ పనులు 40 శాతం పూర్తయ్యాయి. తావీ అల్ నిస్ఫ్ నివాస ప్రాంతంలో అంతర్గత రోడ్ల పనులు 99 శాతం పూర్తయ్యాయి.
బిద్బిద్లో OMR2.2 మిలియన్లకు పైగా వ్యయంతో అంతర్గత రోడ్లు, కన్సల్టెన్సీ పనులు జరుగుతున్నాయి. 15 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం 65 శాతం పూర్తికాగా, అల్ సయ్ అల్ అహ్మర్ అంతర్గత రోడ్ల పనులు 95 శాతం పూర్తయ్యాయి. అల్ జబల్ అల్ అఖ్దర్లో మార్వా రోడ్డు మరమ్మతులకు సుమారు OMR50,000 ఖర్చు చేస్తున్నారు. ఈ పనులు 50 శాతం పూర్తయ్యాయి. ఐదు కిలోమీటర్ల మేర డ్యూయల్ రోడ్డు నిర్మాణం, విలాయత్ ప్రవేశ మార్గం అభివృద్ధికి సంబంధించిన డిజైన్ కన్సల్టెన్సీ పనులు 90 శాతం పూర్తయ్యాయి.
కొత్తగా OMR5.7 మిలియన్లకు పైగా కాంట్రాక్టులు
పలు విలాయత్‌లలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, కొత్త నివాస ప్రాంతాలకు రహదారుల నిర్మాణం కోసం గవర్నరేట్ ఇటీవల OMR5.7 మిలియన్లకు పైగా విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంది.నిజ్వా, బహ్లా, అల్ హమ్రా, ఆదమ్ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు సుమారు OMR922,000 కేటాయించారు. బిద్బిద్, సమైల్, ఇజ్కీ ప్రాంతాల్లో చేపట్టే పనులకు OMR1 మిలియన్‌కు పైగా ఖర్చు చేయనున్నారు.
ఇజ్కీలో అల్ వషాహి-అల్ తసావీర్ రోడ్డు నిర్మాణం, డిజైన్ కోసం OMR2.2 మిలియన్ల కాంట్రాక్టు కుదిరింది. సమైల్‌లో అంతర్గత రోడ్ల ప్రాజెక్టు రెండో దశకు OMR1.6 మిలియన్లకు పైగా కేటాయించారు.
మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టులు
ఇజ్కీ-నిజ్వా రోడ్డు విస్తరణ పనులు OMR46.8 మిలియన్ల వ్యయంతో కొనసాగుతున్నాయి. ఖరౌత్ సౌత్, బిర్కత్ అల్ మౌజ్, ఫర్క్ ప్రాంతాలను కలిపే ఈ ప్రాజెక్టులో 30 కిలోమీటర్లకు పైగా డ్యూయల్ క్యారేజ్‌వే, 3.167 కిలోమీటర్ల సర్వీస్ రోడ్లు, సినావ్ లింక్‌లో 1.163 కిలోమీటర్ల రహదారి విస్తరణ ఉన్నాయి. ప్రస్తుతం పనులు 36 శాతం పూర్తయ్యాయి. మార్చి 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జబల్ షమ్స్ రోడ్డు ప్రాజెక్టును OMR20.1 మిలియన్లకు పైగా వ్యయంతో చేపట్టారు. 32 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రహదారి పనులు ప్రస్తుతం 9.3 శాతం పూర్తయ్యాయి. జనవరి 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో జబల్ అల్ సరాత్ వైపు 26 కిలోమీటర్ల రహదారి, దార్ అల్ అఖూర్ నుంచి దార్ అల్ సౌదా వరకు ఆరు కిలోమీటర్ల రహదారి ఉన్నాయి. వీటి ద్వారా గ్రామాలు, పాఠశాలలు, పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు సులభతరం కానున్నాయి.
అల్ జబల్ అల్ అఖ్దర్లో సైహ్ ఖత్నా రోడ్డు అభివృద్ధి పనులు OMR4.5 మిలియన్లకు పైగా వ్యయంతో కొనసాగుతున్నాయి. 9.1 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ ప్రాజెక్టు 75 శాతం పూర్తయింది. రోడ్డు మెరుగుదల, లైటింగ్, భూసంబంధిత పనులు, రక్షణ ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి.
13.17 కిలోమీటర్ల పొడవైన సంత్-వాడీ అల్ అలా రోడ్డు ప్రాజెక్టుకు OMR4.1 మిలియన్లకు పైగా ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం సన్నాహక దశలో ఉన్న ఈ ప్రాజెక్టులో మిగిలిన ఆరు కిలోమీటర్ల రహదారి నిర్మాణంతోపాటు తారు రోడ్డు, కల్వర్టులు, రిటైనింగ్ వాల్స్, రహదారి భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. మార్చి 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రీన్ మౌంటైన్ రోడ్డులోని వాడీ బనీ హబీబ్ వద్ద మూడు ప్రాంతాల్లో బాక్స్ కల్వర్టుల నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షపు నీరు సులభంగా వెళ్లేందుకు చేపట్టే ఈ పనులకు OMR284,000కు పైగా ఖర్చు చేయనున్నారు.
సమైల్, ఇజ్కీ మధ్య అఖబా అఫ్రీ, అల్ సఖారి గ్రామాల రోడ్డు ప్రాజెక్టు 6.2 కిలోమీటర్ల మేర కొనసాగుతోంది. OMR4.5 మిలియన్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఈ పనులు 89 శాతం పూర్తయ్యాయి. అల్ సఖారి గ్రామానికి వెళ్లే 3.2 కిలోమీటర్ల రహదారి పూర్తికాగా, అఖబా అఫ్రీ రోడ్డులో మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒమన్ పామ్ డెవలప్మెంట్ కంపెనీ ఫ్యాక్టరీకి వెళ్లే 3.75 కిలోమీటర్ల రహదారిని కూడా OMR1.07 మిలియన్లకు పైగా వ్యయంతో నిర్మించి ప్రారంభించారు. దీంతో పారిశ్రామిక కేంద్రానికి రవాణా సౌకర్యం మెరుగుపడింది. ఈ ప్రాజెక్టుల ద్వారా అల్ దఖిలియా గవర్నరేట్‌లో రహదారి నెట్వర్క్ ఆధునికీకరణ, ప్రజలకు అవసరమైన సేవలు, పర్యాటక ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం, రహదారి భద్రత పెంపు వంటి లక్ష్యాలను సాధించేందుకు ఒమన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్తగా మరో రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు..!!
- అల్ దఖిలియాలో OMR103 మిలియన్లతో రోడ్ల ప్రాజెక్టులు..!!
- ఒమన్ సముద్రంలో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- కువైట్‌లో ‘లులూ వాలీ దీపావళి 2026’ వేడుకలు..!!
- దుబాయ్ నుంచి మనీలాకు Dh1కే విమాన టికెట్..!!
- సౌదీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల్లో సౌదీకరణ మరింత కఠినతరం..!!
- GCC దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం..!!
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు







