యూఏఈ పాఠశాలల్లో కఠినమైన సైబర్ భద్రతా నిబంధనలు..!!

- November 09, 2026 , by Maagulf
యూఏఈ పాఠశాలల్లో కఠినమైన సైబర్ భద్రతా నిబంధనలు..!!

దుబాయ్: విద్యార్థులను ఆన్‌లైన్ ముప్పులు, సైబర్ వేధింపులు, అనుచిత కంటెంట్ నుంచి రక్షించేందుకు యూఏఈలోని ప్రైవేటు పాఠశాలలు ఇంటర్నెట్ వినియోగంపై మరిన్ని ఆంక్షలు అమలు చేస్తున్నాయి. విద్యార్థులు ఇంటర్నెట్‌లో ఏం సెర్చ్ చేయవచ్చు, ఎలాంటి వీడియోలు చూడవచ్చనే అంశాలపై కఠినమైన నియంత్రణలు తీసుకొస్తున్నాయి.

2026–2027 విద్యా సంవత్సరం నుంచి పలు పాఠశాలలు సైబర్ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశాయి. పాఠశాల నెట్‌వర్క్‌లో ఇంటర్నెట్ వినియోగాన్ని పర్యవేక్షించడం, అనుచిత వెబ్‌సైట్లు, వీడియోలను బ్లాక్ చేయడం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగాన్ని పరిమితం చేయడం వంటి చర్యలు చేపడుతున్నాయి. తల్లిదండ్రుల భాగస్వామ్యం, ముందస్తు జాగ్రత్తలు, బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కూడా అవసరమని స్కూల్స్ పేర్కొంటున్నాయి.

గూగుల్ సెర్చ్, యూట్యూబ్‌పై ప్రత్యేక నియంత్రణలు

రాస్ అల్ ఖైమాలోని RAK అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నెట్ ఫిల్టరింగ్ వ్యవస్థను మరింత కఠినతరం చేసింది. సాధారణ బ్లాక్‌లిస్ట్ విధానంతో గుర్తించలేని వెబ్‌సైట్లను కూడా నియంత్రించేలా కొత్త వ్యవస్థను తీసుకొచ్చినట్లు ఆ పాఠశాల పాజిటివ్ ఎంగేజ్‌మెంట్ విభాగం అధిపతి లీ వాట్సన్ తెలిపారు. ఎన్‌క్రిప్టెడ్ వెబ్‌సైట్లలోనూ ఫిల్టరింగ్ అమలు చేయడంతో పాటు గూగుల్ సెర్చ్‌లో SafeSearch తప్పనిసరి చేశారు. యూట్యూబ్ వీడియోలపై కఠినమైన నియంత్రణలు, ప్రత్యేక కంటెంట్ బ్లాకింగ్ విధానాలను అమలు చేస్తున్నారు. 

అలాగే, విద్యార్థులు పాఠశాలకు వ్యక్తిగత మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. వారి ఫోన్లకు పాఠశాల విద్యార్థుల Wi-Fi నెట్‌వర్క్‌ను ఉపయోగించే అవకాశం లేకుండా చేశారు. అయితే, విద్యార్థులు ఏది చూడవచ్చో ఫిల్టర్లు నిర్ణయించగలవని, కానీ ఎవరూ అడ్డుకోనప్పుడు వారు ఎలా ప్రవర్తించాలనేది వారి వ్యక్తిత్వం, అవగాహనపై ఆధారపడి ఉంటుందని లీ వాట్సన్ పేర్కొన్నారు.

సైబర్ వేధింపులపై ప్రత్యేక నిఘా

దుబాయ్‌లోని Credence హై స్కూల్ కూడా సైబర్ భద్రతా చర్యలను పెంచింది. పాఠశాల సీఈఓ, ప్రిన్సిపాల్ దీపికా థాపర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2026 ఏప్రిల్‌లో పాఠశాల యాంటీ-బుల్లీయింగ్, సైబర్ సేఫ్టీ పాలసీని KHDA నిబంధనలు, విద్యార్థుల సంక్షేమ మార్గదర్శకాలకు అనుగుణంగా నవీకరించారు. ఫైర్‌వాల్ రక్షణ, అనుమతి పొందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం, విద్యార్థుల ఆన్‌లైన్ ప్రవర్తనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సైబర్ సేఫ్టీ ఇన్‌చార్జ్‌లను నియమించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com