దీపావళి వేళ ఘోర అగ్నిప్రమాదాలు.. మూడు ఘటనల్లో 18 మంది సజీవదహనం!

- November 09, 2026 , by Maagulf
దీపావళి వేళ ఘోర అగ్నిప్రమాదాలు.. మూడు ఘటనల్లో 18 మంది సజీవదహనం!

దీపావళి పండుగ సంబరాలు ముగిసిన మరుసటి రోజే మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జరిగిన మూడు వేర్వేరు అగ్నిప్రమాదాలు 18 మంది ప్రాణాలను బలిగొన్నాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉండటం మరింత విషాదకరం. మధ్యప్రదేశ్‌లోని సియోనీ, కట్నీ జిల్లాల్లో రెండు ఇళ్లలో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబాలకు చెందిన 12 మంది మరణించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవదహనమయ్యారు.

సియోనీలో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లా ఛపారా పట్టణంలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మహావీర్ వార్డులోని జైన ఆలయం సమీపంలో బంగారు ఆభరణాల వ్యాపారి కుందన్‌లాల్ సోనీకి చెందిన మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇంట్లో మొత్తం పది మంది ఉన్నారు. మంటలు వేగంగా భవనం అంతటా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు బయటకు రావడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే మరో ఆరుగురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో వృద్ధ దంపతులు, మైనర్ బాలుడు

ఈ ప్రమాదంలో కుందన్‌లాల్ సోనీ (75), ఆయన భార్య రాజ్‌కుమారి సోనీ (65), రీతూ సోనీ (42), స్మృతి సోనీ (40), సూర్య సోనీ (45), ఆదిత్య సోనీ (16) మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక మైనర్ బాలుడు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com