బహ్రెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కౌన్సిల్ కీలక నిర్ణయం..!!

- November 10, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కౌన్సిల్ కీలక నిర్ణయం..!!

మనామా: బహ్రెయిన్‌లోని సార్ ప్రాంతంలో గతేడాది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదం జరిగిన చోట స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని నార్తర్న్ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సిల్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

సార్‌లోని బ్లాక్ 525లో, షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే సమీపంలోని అవెన్యూ 13 రహదారిపై స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని ఐదో నియోజకవర్గ ప్రతినిధి తారిఖ్ అల్ ఫర్సానీ ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో మరో ప్రమాదం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

2025 మే 30న ఈ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. గంటకు 50 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న రోడ్డుపై ఓ కారు డ్రైవర్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కుటుంబం కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడి మరణించారు. వారి చిన్న కుమారుడు రెండు వారాల తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్యం, మాదకద్రవ్యాల మత్తులో వాహనం నడిపినట్లు తేలడంతో కోర్టు అతనికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది మార్చిలో కోర్ట్ ఆఫ్ కసేషన్ కూడా ఆ శిక్షను సమర్థించింది. ఈ నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్ నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా చేపట్టాలని కోరుతూ మున్సిపాలిటీ వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాయాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఈ పనులను వెంటనే చేపట్టేలా వర్క్స్ మంత్రిత్వశాఖపై ఒత్తిడి తీసుకురావాలని కోరనుంది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరోసారి జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు వల్ల వాహనాల వేగం తగ్గి రహదారిపై ప్రయాణించే వారందరికీ భద్రత పెరుగుతుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com