కన్ఫామ్ టికెట్ లేకుంటే వందే భారత్ ఎక్కలేరు

- November 10, 2026 , by Maagulf
కన్ఫామ్ టికెట్ లేకుంటే వందే భారత్ ఎక్కలేరు

న్యూ ఢిల్లీ: రైలు ప్రయాణం అంటేనే చాలా మందికి ముందుగా గుర్తుకువచ్చేది తక్కువ ఖర్చుతో కూడిన సురక్షిత ప్రయాణం. అయితే అత్యవసర సమయాల్లో లేదా చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వస్తే తత్కాల్, ఆర్‌ఏసీ (RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఆధారపడటం సాధారణం. కానీ, భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Sleeper Train) నిబంధనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈ ప్రీమియం ట్రైన్‌లో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు కొన్ని ప్రత్యేక రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి.

వందే భారత్ స్లీపర్‌లో తత్కాల్, వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు నో ఎంట్రీ!
సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాదిరిగా వందే భారత్ స్లీపర్ రైళ్లలో తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ సదుపాయాలు ఉండవు. చివరి నిమిషంలో ప్రయాణం ప్లాన్ చేసుకుని తత్కాల్‌లో టికెట్ బుక్ చేసుకుందామంటే అస్సలు కుదరదు. ప్రయాణికులు ముందుగానే సాధారణ అడ్వాన్స్ రిజర్వేషన్ విధానంలో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, సాధారణ రైళ్లలో కన్ఫర్మ్ టికెట్ రాకపోతే ఆర్‌ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. కానీ, వందే భారత్ స్లీపర్‌లో ఈ నిబంధన వర్తించదు. ఈ రైలులో పూర్తిగా కన్ఫర్మ్ అయిన బెర్త్ ఉన్నవారినే మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తారు. ఒకే పీఎన్‌ఆర్ (PNR)పై కొంతమందికి కన్ఫర్మ్ అయి, మరికొందరు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే.. ఆ వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించడానికి అర్హులు కరు.

వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలు మరియు కోచ్‌ల వివరాలు
ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ వందే భారత్ స్లీపర్ రైలు మొత్తం 16 కోచ్‌లతో నడుస్తుంది.

  • ఏసీ 3 టైర్ (AC 3 Tier): 11 కోచ్‌లు (611 బెర్తులు)
  • ఏసీ 2 టైర్ (AC 2 Tier): 4 కోచ్‌లు (188 బెర్తులు)
  • ఏసీ ఫస్ట్ క్లాస్ (AC First Class): 1 కోచ్ (24 బెర్తులు)

మొత్తంగా ఈ రైలులో 823 బెర్తుల సామర్థ్యం ఉంది. ఇందులో మహిళల కోస ప్రత్యేకంగా 6 బెర్తులు, రైల్వే సిబ్బంది డ్యూటీ పాస్ కోటా కింద 21 బెర్తులు కేటాయించారు. నిబంధనల ప్రకారం మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు తగిన కోటాలు వర్తిస్తాయి. అలాగే, ఈ రైలులో ఫ్లెక్సీ ఫేర్ లేదా డైనమిక్ ప్రైసింగ్ విధానం ఉండదు; నిర్ణీత రిజర్వేషన్ ఛార్జీల ప్రకారమే టికెట్ బుకింగ్ జరుగుతుంది.

ఏయే మార్గాల్లో వందే భారత్ స్లీపర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి?
రాత్రిపూట సుదూర ప్రయాణాలను అత్యంత సౌకర్యవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రధాన నగరాలను కలుపుతూ ప్రస్తుతం మూడు జతల వందే భారత్ స్లీపర్ సర్వీసులు నడుస్తున్నాయి:

  • హౌరా – కామాఖ్య
  • న్యూఢిల్లీ – వారణాసి
  • ముంబై (CSMT) – బెంగళూరు (SMVT)

టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలు మరియు రీఫండ్ వివరాలు

వందే భారత్ స్లీపర్‌లో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే క్యాన్సిలేషన్ రూల్స్ గమనించాలి

  • రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందుగా రద్దు చేస్తే ఛార్జీలో 25 శాతం కోత విధిస్తారు.
  • 72 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం ఛార్జీ మినహాయిస్తారు.
  • ప్రయాణానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ (డొక్కు) రాదు.

కాబట్టి, వందే భారత్ స్లీపర్‌లో ప్రయాణించాలనుకునేవారు ఈ ప్రత్యేక నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ముందే ప్లాన్ చేసుకోవడం ద్వారా చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందులను సులభంగా నివారించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com