కువైట్‌లో వాహనదారులకు ట్రాఫిక్ సేవలు మరింత సులభతరం..!!

- November 10, 2026 , by Maagulf
కువైట్‌లో వాహనదారులకు ట్రాఫిక్ సేవలు మరింత సులభతరం..!!

కువైట్ : కువైట్‌లో వాహనదారులకు ట్రాఫిక్ సేవలను మరింత సులభతరం చేసేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘మై కువైట్ మొబైల్ ఐడీ’ (My Kuwait Mobile ID) యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ గుర్తింపు ధ్రువీకరణ పూర్తి చేసిన అనంతరం, అధీకృత ప్రతినిధుల ద్వారా 18 రకాల ట్రాఫిక్ లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కల్పించింది.

ట్రాఫిక్ విభాగాల కార్యాలయాలకు స్వయంగా వెళ్లలేని వారు తమ తరఫున అధీకృత ప్రతినిధులను పంపించి ఈ సేవలను పొందవచ్చని మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో సంబంధిత వ్యక్తులు స్వయంగా హాజరుకావాల్సిన అవసరం ఉండదు. ఈ 18 సేవల్లో వాహన యాజమాన్య బదిలీ, వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయడం, నంబర్ ప్లేట్లు పోయినా లేదా దెబ్బతిన్నా కొత్తవి పొందడం, వాహనాల రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ రెన్యూవల్, వాహన లైసెన్స్ ప్లేట్లను తీసుకోవడం, వాహన లైసెన్సుల రద్దు వంటి సేవలు ఉన్నాయి.

మైనర్ల పేరుపై వాహన యాజమాన్యాన్ని బదిలీ చేసేందుకు తల్లిదండ్రుల అనుమతి పొందడం, వాహనాలను స్క్రాప్ చేయడం, కొత్త వాహనాల తనిఖీలు, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన లావాదేవీలు, మార్కెట్ పర్మిట్లు కూడా ఈ సేవల్లో భాగంగా ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలను బదిలీ చేయడం, ట్రాఫిక్ పాయింట్ల విధానం కింద డ్రైవింగ్ లైసెన్సుల ఉపసంహరణ, ట్రాఫిక్ సంతకాల ఆమోదాల జారీ, రెన్యూవల్, సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయడం, ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను కోర్టుకు పంపించడం వంటి సేవలను కూడా ప్రతినిధుల ద్వారా పొందవచ్చు.

ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని తగ్గించడం, పరిపాలనా ప్రక్రియలను సరళీకరించడం, ప్రజల సమయం, శ్రమను ఆదా చేయడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వశాఖ తెలిపింది. డిజిటల్ గుర్తింపు ధ్రువీకరణ ద్వారా ట్రాఫిక్ సేవలను మరింత సమర్థంగా అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com