డిసెంబర్ 4 నుంచి 32వ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్..

- November 10, 2026 , by Maagulf
డిసెంబర్ 4 నుంచి 32వ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్..

దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, షాపింగ్ ప్రియులను ఆకర్షించే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF) 32వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. 2026 డిసెంబర్ 4 నుంచి 2027 జనవరి 17 వరకు 45 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. నగరవ్యాప్తంగా షాపింగ్ ఆఫర్లు, అంతర్జాతీయ సంగీత కచేరీలు, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్, అద్భుతమైన లైట్ షోలు, కుటుంబ వినోద కార్యక్రమాలతో దుబాయ్ సందడిగా మారనుంది.

మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ఈసారి మరింత వైవిధ్యమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించనుంది. జేబీఆర్ (JBR) సముద్ర తీర ప్రాంతం నుంచి హట్టా పర్వత ప్రాంతాల వరకు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ప్రారంభ వేడుకల్లో ప్రముఖ సంగీత కళాకారులు

32వ ఎడిషన్ ప్రారంభ వేడుకల్లో ముగ్గురు ప్రముఖ కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. డిసెంబర్ 4న ప్రముఖ అరబ్ గాయకుడు రషీద్ అల్ మాజిద్ కోకాకోలా అరేనాలో సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. డిసెంబర్ 5న అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ స్టార్ స్టీవ్ అయోకి అదే వేదికపై సందడి చేయనున్నారు. రషీద్ అల్ మాజిద్ షో టికెట్లు ప్లాటినమ్‌లిస్ట్ ద్వారా అందుబాటులోకి రానుండగా, స్టీవ్ అయోకి ప్రదర్శనకు సంబంధించిన వివరాలను కోకాకోలా అరేనా వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు.

జేబీఆర్, బ్లూవాటర్స్‌లో అద్భుతమైన లైట్ షో

ఈసారి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా డీఎస్ఎఫ్ లైట్ షో నిలవనుంది. జేబీఆర్‌లోని ది బీచ్, బ్లూవాటర్స్ ఐలాండ్ మధ్య ఉన్న సముద్ర ప్రాంతాన్ని భారీ ఓపెన్ ఎయిర్ మల్టీమీడియా వేదికగా మార్చనున్నారు.

డిసెంబర్ 5 నుంచి 2027 జనవరి 17 వరకు ప్రతిరోజూ రాత్రి 7:30 నుంచి 10:30 గంటల వరకు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయి. ఇందులో లేజర్ షోలు, డ్రోన్ ప్రదర్శనలు, సంగీతానికి అనుగుణంగా మారే లైటింగ్ ఎఫెక్ట్స్, భవనాలపై ప్రత్యేక లేజర్ మ్యాపింగ్ వంటి కార్యక్రమాలు ఉంటాయి.

ప్రతి రాత్రి సంగీతంతో కూడిన రెండు ప్రత్యేక డ్రోన్ షోలు నిర్వహించనున్నారు. జేబీఆర్ బీచ్‌ఫ్రంట్, బ్లూవాటర్స్ ప్రొమెనేడ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే లేజర్ ఇన్‌స్టాలేషన్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. సముద్రం మధ్యలో ఏర్పాటు చేసే ప్రత్యేక ఫ్లోటింగ్ ఇన్‌స్టాలేషన్ ఈ ప్రదర్శనకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

హట్టాలో ఈద్ అల్ ఎతిహాద్ ప్రత్యేక సంగీత వేడుక

దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే డిసెంబర్ 2న హట్టా వాడి హబ్‌లో ప్రత్యేక క్యాండిల్‌లైట్ సంగీత కచేరీ నిర్వహించనున్నారు. యూఏఈ జాతీయ దినోత్సవం (ఈద్ అల్ ఎతిహాద్) సందర్భంగా ఖలీజీ సంగీత కార్యక్రమాన్ని హట్టా పర్వతాల అందమైన ప్రకృతి మధ్య నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. నక్షత్రాల వెలుగులో సంగీతాన్ని ఆస్వాదించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

దుబాయ్ శీతాకాల వేడుకల్లో కీలక భాగం

దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) సీఈఓ అహ్మద్ అల్ ఖాజా మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నగర శీతాకాల వేడుకల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిందన్నారు. ఈసారి కొత్త వినోద కార్యక్రమాలు, షాపింగ్ అవకాశాలు, కుటుంబాల కోసం ప్రత్యేక అనుభవాలను అందించనున్నట్లు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాలు సందర్శకులకు మరపురాని అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు.

షాపింగ్ ఆఫర్లు.. బహుమతులు

సంగీత, వినోద కార్యక్రమాలతో పాటు నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్, రిటైల్ కేంద్రాల్లో ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రమోషన్లు, బహుమతులు గెలుచుకునే అవకాశాలు కల్పించనున్నారు. వివిధ మాల్స్‌లో నిర్వహించే రాఫెల్ డ్రాలు, ప్రత్యేక ఆఫర్ల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

ప్రముఖ సంస్థల భాగస్వామ్యం

దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలకు కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అల్ ఫుట్టైమ్ మాల్స్, అల్ జరూనీ గ్రూప్, AW రోస్టమానీ ఆటోమోటివ్, దుబాయ్ హోల్డింగ్ అసెట్ మేనేజ్‌మెంట్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్, ENOC, ఎతిసలాత్, మజీద్ అల్ ఫుట్టైమ్, మెరెక్స్ ఇన్వెస్ట్‌మెంట్, తలాబాత్ తదితర సంస్థలు వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.

డిసెంబర్ 4న ప్రారంభమై జనవరి 17 వరకు కొనసాగనున్న ఈ 45 రోజుల పండుగ దుబాయ్‌ను అంతర్జాతీయ షాపింగ్, వినోద కేంద్రంగా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేయనుంది.

మరిన్ని వివరాలు, టికెట్లు, కార్యక్రమాల సమాచారం కోసం http://www.mydsf.aeవెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com