ఘనంగా గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ 28వ వార్షికోత్సవం..

- November 10, 2026 , by Maagulf
ఘనంగా గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ 28వ వార్షికోత్సవం..

అజ్మాన్: యూఏఈలోని ప్రముఖ విద్యాసంస్థ గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ (GMU) తన 28వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. అజ్మాన్‌లో జరిగిన ఈ వేడుకలో యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఉన్నతాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.తుంభే గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తుంభే మొయిదీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ వేడుక ప్రత్యేకత ఏమిటంటే.. థంబే ఆసుపత్రుల్లో జన్మించిన విద్యార్థులు, అదే సంస్థలో చదువుకుని తిరిగి అక్కడే ఉద్యోగులుగా చేరిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం అదే యూనివర్సిటీలో చదువుతున్న వారి పిల్లలు ఒకే వేదికపై కలుసుకున్నారు. యూనివర్సిటీ 28 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలు, తరతరాల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ తుంభే మొయిదీన్ మాట్లాడుతూ.. థంబే ఆసుపత్రుల్లో జన్మించిన విద్యార్థులు, చదువు పూర్తయ్యాక తిరిగి తమ సంస్థలోనే సేవలందించేందుకు వచ్చిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం ఇక్కడే చదువుకుంటున్న వారి పిల్లలను ఒకే వేదికపై చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్య, ఆరోగ్య సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ఈ సంస్థను నిర్మించామని తెలిపారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన భగవంతుడికి, యూఏఈ పాలకులకు, తన బృందానికి, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

జీఎంయూ ఛాన్సలర్ ప్రొఫెసర్ మందా వెంకటరమణ మాట్లాడుతూ.. 28 ఏళ్లుగా వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సేవలు, సాంకేతిక ఆవిష్కరణల్లో యూనివర్సిటీ నిరంతరం పురోగతి సాధిస్తోందన్నారు. అంతర్జాతీయ గుర్తింపులు, ప్రపంచ ర్యాంకింగ్స్, పరిశోధనలు, విద్యా కార్యక్రమాల విస్తరణతో అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని పేర్కొన్నారు. ఈ విజయాలన్నింటికీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల కృషే ప్రధాన కారణమని తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన స్టూడెంట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులను డాక్టర్ తుంభే మొయిదీన్, ప్రొఫెసర్ మందా వెంకటరమణ సత్కరించారు.

అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో జీఎంయూకు గుర్తింపు

జీఎంయూ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ గుర్తింపు లభించిన సంవత్సరంగా 2026 నిలిచింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో తొలిసారిగా 1001–1200 విభాగంలో స్థానం సంపాదించింది. అంతర్జాతీయ దృక్పథం (International Outlook) విభాగంలో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని సాధించింది.

ఈ విభాగంలో 118 దేశాలు, ప్రాంతాలకు చెందిన 2,297 విశ్వవిద్యాలయాల్లో జీఎంయూ 99.4 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌లో యూఏఈ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్రత్యేక వైద్య, ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది.

అలాగే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్: అరబ్ రీజియన్ 2027లో 125వ స్థానాన్ని సాధించింది. అంతర్జాతీయ విద్యార్థుల నిష్పత్తి విభాగంలో అరబ్ ప్రాంతంలో మొదటి స్థానంలో నిలిచింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2026లో ఫార్మసీ అండ్ ఫార్మకాలజీ విభాగంలో 351–400 స్థానాల మధ్య చోటు సంపాదించింది. ఈ విభాగంలో ర్యాంకింగ్ పొందిన యూఏఈలోని ఐదు విశ్వవిద్యాలయాల్లో జీఎంయూ ఒకటి.

THE అరబ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో 88వ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా, 2026 జూన్‌లో యూకేకు చెందిన క్వాలిటీ అస్యూరెన్స్ ఏజెన్సీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (QAA) నుంచి సంస్థాగత అక్రిడిటేషన్ పొందింది. ఈ గుర్తింపు 2031 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

117 దేశాలకు చెందిన విద్యార్థులతో విద్యా ప్రస్థానం

1998లో తుంభే గ్రూప్ ఆధ్వర్యంలో స్థాపించబడిన గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో ప్రస్తుతం ఏడు కళాశాలలు, 45 గుర్తింపు పొందిన విద్యా కార్యక్రమాలు ఉన్నాయి. 117కు పైగా దేశాలకు చెందిన విద్యార్థులు, 56 దేశాలకు చెందిన అధ్యాపకులు ఇక్కడ విద్యా, పరిశోధనా కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పటివరకు 5,000 మందికి పైగా విద్యార్థులు పట్టభద్రులై ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆరోగ్య రంగాల్లో సేవలందిస్తున్నారు.

థంబే గ్రూప్‌కు చెందిన అకడమిక్ హెల్త్ సిస్టమ్‌లో ఏడు అకడమిక్ ఆసుపత్రులు, 3,100కు పైగా శిక్షణ పడకలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్య ఒప్పందాలు కొనసాగుతున్నాయి.

తుంభే హెల్త్‌కేర్‌కు లభించిన జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) ఎంటర్‌ప్రైజ్ అక్రిడిటేషన్ ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఈ గుర్తింపును యూఏఈలో తొలిసారిగా పొందిన సంస్థగా, ప్రపంచవ్యాప్తంగా ఈ గుర్తింపు పొందిన ఐదు గ్రూపుల్లో ఒకటిగా థంబే హెల్త్‌కేర్ నిలిచింది. ప్రాంతంలోనే అతిపెద్ద ప్రైవేట్ అకడమిక్ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన థంబే యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఇప్పటివరకు 175కు పైగా దేశాలకు చెందిన రోగులకు వైద్య సేవలు అందించారు.

వైద్యం, దంత వైద్యం, ఫార్మసీ, నర్సింగ్, ఆరోగ్య శాస్త్రాలు, మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెటర్నరీ మెడిసిన్ తదితర రంగాల్లో జీఎంయూ విద్యా కార్యక్రమాలను అందిస్తోంది. థంబే గ్రూప్‌కు చెందిన ఆసుపత్రుల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ కూడా కల్పిస్తోంది.

28 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ.. అంతర్జాతీయ వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల రంగాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది. మరిన్ని వివరాలకు http://gmu.ac.ae వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com