ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా డీఎస్పీలు విధులు నిర్వహించాలి: సీఎం రేవంత్

- November 10, 2026 , by Maagulf
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా డీఎస్పీలు విధులు నిర్వహించాలి: సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచేలా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా విధుల్లో అంకితభావం, నిబద్ధతతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నూతనంగా ఎంపికైన ప్రొబేషనరీ డీఎస్పీలకు సూచించారు. పోలీసు శాఖలో క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండేది మీరేనని, మీ పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా నిలుస్తుందని అన్నారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో శిక్షణ పూర్తి చేసుకున్న నూతన డీఎస్పీలకు నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ సమయంలో ట్రైనీ అధికారులు తీసిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించారు. అనంతరం ‘క్రైమ్ సీన్ ఫోరెన్సిక్స్’ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురు ట్రైనీ డీఎస్పీలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డీఎస్పీలుగా తొలిసారిగా బాధ్యతలు చేపడుతున్నప్పటికీ, తాము ఎక్కడి నుంచి వచ్చామో, ఏ లక్ష్యంతో పోలీసు శాఖలోకి ప్రవేశించామో మరిచిపోవద్దని సూచించారు. లక్ష్య సాధనలో ఇది మొదటి అధ్యాయం మాత్రమేనని, అసలైన రెండో అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతోందని అన్నారు. అంకితభావం, దృఢ సంకల్పంతో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని పేర్కొన్నారు.

పది మంది డీఎస్పీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో పాలన లేదని, శాంతిభద్రతలు క్షీణించాయని, అవినీతి పెరిగిందని విమర్శలు వచ్చే అవకాశం ఉందని సీఎం అన్నారు. అదే పది మంది డీఎస్పీలు నిబద్ధతతో పనిచేస్తే పది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచే అవకాశం ఉంటుందని చెప్పారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలి

సమస్య పరిష్కారానికి ముందుగా బాధితుల ఇబ్బందులను పూర్తిగా వినాలని, వాటి మూలాలను అర్థం చేసుకోవాలని సీఎం సూచించారు. సమస్య ఏమిటో తెలుసుకోవడం, దానిని పరిష్కరించే దిశగా వేసే తొలి అడుగులోనే సగం పరిష్కారం ఉంటుందని అన్నారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని, అవసరమైన సమయం, వనరులు, సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.

గత ఏడు దశాబ్దాలుగా దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖలోని సీనియర్ అధికారులు చేసిన సేవల వల్లే ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం ఏర్పడిందని గుర్తుచేశారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవడం కొత్తగా బాధ్యతలు చేపడుతున్న అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.

మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా సన్నద్ధం కావాలి

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నేరాల స్వరూపం కూడా మారుతోందని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో కల్తీ మద్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి మాదకద్రవ్యాల సవాళ్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఎవరెంతటి శక్తిమంతులైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకునే లక్ష్యంతో తెలంగాణలో ఈగల్ (EAGLE) వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు.

ట్రాఫిక్ సమస్యలు, ఆహార భద్రత, డ్రగ్స్, సైబర్ నేరాలు వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి స్పష్టమైన విధానాలు అవసరమని అన్నారు. మొబైల్ ఫోన్ ద్వారా దూర ప్రాంతాల నుంచి కూడా నేర కార్యకలాపాలను నిర్వహించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు.

కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖలో సీఐడీ, ఏసీబీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కొత్తగా ఎంపికైన డీఎస్పీలు తమ నైపుణ్యాలకు అనుగుణంగా ప్రత్యేక పోలీసు విభాగాలను ఎంచుకోవాలని సూచించారు. అవసరమైతే దేశంలోని ప్రముఖ శిక్షణ సంస్థల్లో ఒకటి లేదా రెండేళ్లపాటు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పోలీసు శాఖలో అంతర్గత నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పారదర్శకంగా గ్రూప్-1 నియామకాలు పూర్తి చేశాం

గ్రూప్-1 నియామక ప్రక్రియను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో గ్రూప్-1 నియామకాల ప్రక్రియ చేపట్టిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ చాలా కాలం పాటు నియామకాలు జరగలేదని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వంటి పరిణామాలతో నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని గుర్తుచేశారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సమూల మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. యూపీఎస్సీ చైర్‌పర్సన్‌తో పాటు నిపుణుల సలహాలు తీసుకుని, అనుభవం, నిజాయితీ, బాధ్యతాయుతమైన వ్యక్తులను కీలక స్థానాల్లో నియమించామని చెప్పారు.

దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 562 గ్రూప్-1 ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని, ఎంపికైన వారిలో 119 మందికి డీఎస్పీలుగా నియామకాలు కల్పించామని వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్‌పర్సన్, డైరెక్టర్ జనరల్ శాంతికుమారి, హోంశాఖ కార్యదర్శి శిఖా గోయల్, రాష్ట్ర భద్రతా సలహాదారు బి. శివధర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com