ఫుజైరా రోడ్డు ప్రమాదంలో కేరళ కుటుంబంలో విషాదం..కవలలతో పాటు మూడేళ్ల బాలుడు మృతి
- November 12, 2026
21 ఏళ్ల కవల సోదరుడు, సోదరితో పాటు మేనల్లుడు దుర్మరణం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురు కుటుంబ సభ్యులు
ఫుజైరా: ఫుజైరాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ భారతీయ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన 21 ఏళ్ల కవలలు, మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయారు. అదే కుటుంబానికి చెందిన మరో నలుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సామాజిక కార్యకర్త తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఈ కుటుంబం చాలాకాలంగా ఫుజైరాలో నివసిస్తోంది. షార్జా నుంచి ఫుజైరాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 21 ఏళ్ల యువకుడు కారు నడుపుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఫుజైరాలోని సామాజిక కార్యకర్త బి.కె. తెలిపారు.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న యువకుడితో పాటు అతని కవల సోదరి, వారి పెద్ద సోదరి కుమారుడైన మూడేళ్ల బాలుడు మరణించారు. కారులో ఉన్న మరో నలుగురు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఫుజైరాలో పెరిగిన కవలలు
మరణించిన కవలలు చిన్నప్పటి నుంచి ఫుజైరాలోనే పెరిగారని సామాజిక కార్యకర్త తెలిపారు. వారి తండ్రి ఫుజైరాలో క్యాఫెటీరియా నిర్వహిస్తున్నారని చెప్పారు. మృతుడైన యువకుడు తరచూ ఆ క్యాఫెటీరియాలో కనిపించేవాడని, అందరితో ఎంతో స్నేహంగా, చిరునవ్వుతో ఉండేవాడని గుర్తుచేసుకున్నారు.
ఈ విషాద ఘటన ఫుజైరాలోని భారతీయ ప్రవాస సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ ప్రమాదంలో పలువురి మృతి
ఇదిలా ఉండగా, గురువారం ఫుజైరా ప్రవేశ మార్గంలోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై ట్రక్కు, పలు వాహనాలు ఢీకొన్న ఘటనలో భారీ ప్రాణనష్టం సంభవించినట్లు ఫుజైరా పోలీసులు ప్రకటించారు. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు.
అయితే, కేరళ కుటుంబానికి చెందిన ముగ్గురు ఇదే ప్రమాదంలో మరణించారా లేదా అన్న విషయంపై అధికారికంగా స్పష్టత రాలేదు.
బాధిత కుటుంబాలకు భారత కాన్సులేట్ పరామర్శ
ఈ ఘోర రోడ్డు ప్రమాదం పై దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారని పేర్కొంటూ, బాధిత కుటుంబాలను సంప్రదించినట్లు వెల్లడించింది.
స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు భారత కాన్సులేట్ పేర్కొంది.
ఫుజైరాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో కేరళ ప్రవాస భారతీయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజా వార్తలు
- దోహాలో భారతీయ ప్రవాసులతో కేంద్ర మంత్రి ఆత్మీయ భేటీ..
- ఫుజైరా రోడ్డు ప్రమాదంలో కేరళ కుటుంబంలో విషాదం..కవలలతో పాటు మూడేళ్ల బాలుడు మృతి
- హైదరాబాద్‌లో మార్స్ సంస్థ భారీ విస్తరణ
- WhatsAppలో కొత్త సేఫ్టీ ఫీచర్..
- విశాఖలో CII అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు
- అబుదాబిలో హోటల్ వద్ద ఘర్షణ..8 మంది అరెస్ట్
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి, 30 మందికి గాయాలు
- దోహాలో రేపు ఘనంగా ICBF డే 2026 వేడుకలు..19 మంది విశిష్ట వ్యక్తులకు సత్కారం
- తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు







