దివ్యాంగులకు అండగా ‘సంకల్పం-2026’..100 మందికి ఉచితంగా కృత్రిమ కాళ్ల అమరిక

- November 13, 2026 , by Maagulf
దివ్యాంగులకు అండగా ‘సంకల్పం-2026’..100 మందికి ఉచితంగా కృత్రిమ కాళ్ల అమరిక

తణుకు: దివ్యాంగులకు చేయూతనిస్తూ, వారిని ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా జీవించేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో డాక్టర్ పీఎన్ఎన్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్, ప్రపంచ తెలుగు సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ‘సంకల్పం-2026’ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తణుకులోని కమ్మ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి 5 వేల మందికి పైగా దివ్యాంగులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జైపూర్‌కు చెందిన ప్రత్యేక బృందం గతంలో తీసుకున్న కొలతల ఆధారంగా సుమారు 100 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లను అమర్చింది. అలాగే 20 మంది స్పెషలిస్ట్ వైద్యులతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. దివ్యాంగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు వివిధ ఆటలు, పాటల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

సేవా కార్యక్రమం అభినందనీయం: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, మరణించిన తన స్నేహితుడు డాక్టర్ కిరణ్ జ్ఞాపకార్థం ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ అధ్యక్షుడు బొల్లా సతీష్‌కుమార్‌తో పాటు ఆయన వెనుక ఉండి సహకరిస్తున్న సమాజ సేవకులందరూ తమ గొప్ప మనసును, సేవా సంకల్పాన్ని చాటుకున్నారని ప్రశంసించారు.

దశాబ్ద కాలంగా దివ్యాంగులకు చేయూత: బొల్లా సతీష్‌కుమార్

ఫౌండేషన్ అధ్యక్షుడు బొల్లా సతీష్‌కుమార్ మాట్లాడుతూ, దశాబ్ద కాలానికి పైగా ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులను తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనే సంకల్పంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెర వెనుక ఉండి సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న పలువురు పెద్దల సహకారం, కృషి ఫలితంగానే ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించగలిగామని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అందిస్తున్న సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులు దివ్యాంగులకు భోజనాలు, మంచినీరు అందించి సేవాభావాన్ని చాటుకున్నారు.

కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సమాఖ్య సెక్రటరీ జనరల్ శ్రీ లక్ష్మి మోహన్ రావు, వజావత్ కాన్‌రాజ్, సృష్టి సుబ్బారావు, షర్మిష్ట వీరన్న, మానేపల్లి కాశీ విశ్వనాథ్, గమిని మహిపాల్, సింహాద్రి కాశీ, నాగళ్ల వెంకటేష్, బైలా లక్ష్మీనారాయణ, కాంచన, వేండ్ర లక్ష్మణ్, తణుకు జగదీష్, నిసా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ అయేషా ఖాన్, ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, దివ్యాంగులు, వారి సహాయకులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు వైద్య సహాయం, కృత్రిమ అవయవాల అమరికతో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందించిన ‘సంకల్పం-2026’ కార్యక్రమం సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com