GMU మెడికల్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌కు 10 వేల మందికి పైగా విద్యార్థులు

- November 13, 2026 , by Maagulf
GMU మెడికల్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌కు 10 వేల మందికి పైగా విద్యార్థులు

యూఏఈలోని 100 పాఠశాలల నుంచి 1,453 ప్రాజెక్టులు.. 20వ వార్షిక ప్రదర్శనలో ఏఐ ఆవిష్కరణలు, పరిశోధనలు, వ్యాపార ఆలోచనలకు ప్రాధాన్యం

అజ్మాన్: యువతలో శాస్త్రీయ ఆలోచనలను, పరిశోధనా ఆసక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ (జీఎంయూ) నిర్వహించిన 20వ మెడికల్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ (MASE 2026) విజయవంతంగా ముగిసింది. ఈ ప్రదర్శనకు 10,000 మందికి పైగా విద్యార్థులు, సందర్శకులు హాజరయ్యారు. యూఏఈ వ్యాప్తంగా 100 పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ ఏడాది ప్రదర్శనలో విద్యార్థులు మొత్తం 1,453 ప్రాజెక్టులు, పరిశోధనా పోస్టర్లు, వ్యాపార ఆలోచనలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆవిష్కరణలను సమర్పించారు. వీటికి అదనంగా ఆన్‌లైన్‌లో 493 మంది పాల్గొన్నారు.

విభాగాల వారీగా చూస్తే 540 సైన్స్ ప్రాజెక్టులు, 419 పరిశోధనా పోస్టర్లు, 310 వ్యాపార ఆలోచనలు, 184 ఏఐ ఆధారిత ఆవిష్కరణలు ప్రదర్శనకు వచ్చాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించడమే కాకుండా, వైద్యులు, ప్రొఫెసర్లు, వైద్య శాస్త్ర నిపుణుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తమ పరిశోధనలపై వివరణ ఇచ్చారు.

ఈ ఏడాది ప్రదర్శనలో ఏఐ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరోగ్య, వైద్య రంగాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు విద్యార్థులు కృత్రిమ మేధను వినియోగిస్తూ తమ ఆలోచనలను ఆవిష్కరణల రూపంలో చూపించారు. వ్యాపార ఆలోచనల విభాగంలోనూ యువత కొత్త పరిష్కారాలను రూపొందించాలనే ఆసక్తిని ప్రదర్శించింది.

వైద్యులు, ప్రొఫెసర్లు, వైద్య శాస్త్ర నిపుణులతో కూడిన జ్యూరీ బృందం సమగ్రంగా పరిశీలించిన అనంతరం, ఉమ్ అల్ ఖువైన్‌లోని మెట్రోపాలిటన్ ఇంటర్నేషనల్ ఇండియన్ ప్రైవేట్ స్కూల్‌కు ఓవరాల్ విజేత పురస్కారం లభించింది. షార్జా ఇండియన్ స్కూల్, ఘుబైబా రన్నరప్‌గా నిలిచింది. 

గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తుంభే గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ థంబే మొయిదీన్ దూరదృష్టితో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. వైద్య విద్యను అభ్యసించాలా, పరిశోధన రంగంలోకి వెళ్లాలా అనే నిర్ణయం తీసుకునే ముందే పాఠశాల విద్యార్థులకు వైద్య విశ్వవిద్యాలయ వాతావరణాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో MASEకు శ్రీకారం చుట్టారు.

2012లో నాలుగు ఎమిరేట్లకు చెందిన 15 పాఠశాలల విద్యార్థులతో ప్రారంభమైన ఈ ప్రదర్శన, ప్రస్తుతం యూఏఈ విద్యా క్యాలెండర్‌లో ప్రముఖ కార్యక్రమంగా ఎదిగింది. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు తుంభే మెడిసిటీలోని జీఎంయూ క్యాంపస్‌ను సందర్శిస్తూ వైద్య, ఆరోగ్య శాస్త్రాలు, పరిశోధన రంగాలపై అవగాహన పొందుతున్నారు.

ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు యూనివర్సిటీ అధ్యాపకులతో మాట్లాడటం, ప్రయోగశాలలు, సిమ్యులేషన్ సదుపాయాలను సందర్శించడం, వైద్య రంగంలోని వృత్తి అవకాశాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వంటి అవకాశాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో వైద్యులు, పరిశోధకులు, ఆరోగ్య రంగ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు MASE వేదికగా నిలుస్తోంది.

తుంభే మెడిసిటీలో ఉన్న గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ, థంబే గ్రూప్‌కు చెందిన విద్యా విభాగం. వైద్యం, డెంటిస్ట్రీ, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, బయోమెడికల్ సైన్సెస్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ హెల్త్ తదితర రంగాల్లో కోర్సులను అందిస్తోంది. 111కు పైగా దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.

జీఎంయూలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలకు www.gmu.ac.ae వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com