బిట్స్ పిలానీ దుబాయ్‌లో డే టైమ్ ఎంబీఏ తరగతులు ప్రారంభం

- November 13, 2026 , by Maagulf
బిట్స్ పిలానీ దుబాయ్‌లో డే టైమ్ ఎంబీఏ తరగతులు ప్రారంభం

గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులకు అనుకూలంగా కొత్త తరగతుల షెడ్యూల్‌.. మేనేజ్‌మెంట్, డేటా, టెక్నాలజీ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి

దుబాయ్: ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే లక్ష్యంతో బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ తన ఎంబీఏ, ఎంబీఏ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సులకు డే టైమ్ తరగతులను ప్రవేశపెట్టింది. పూర్తి స్థాయిలో క్యాంపస్‌లో చదువుకోవాలనుకునే విద్యార్థులతో పాటు, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వృత్తి నిపుణులకు ఈ కొత్త షెడ్యూల్‌ ఉపయోగపడనుంది.

ఇదే క్యాంపస్‌లో వ్యాపార విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేస్తూ నాలుగేళ్ల బీబీఏ (ఆనర్స్) కోర్సును కూడా అందిస్తున్నారు. ఈ కోర్సులో ప్రాక్టికల్‌ శిక్షణకు, పరిశ్రమలతో అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

యూఏఈలో మారుతున్న ఉద్యోగ రంగ అవసరాల నేపథ్యంలో ఈ కోర్సులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనాల ప్రకారం, 2030 నాటికి యూఏఈలో ప్రస్తుత ప్రధాన ఉద్యోగ నైపుణ్యాల్లో 41 శాతం మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రపంచ సగటు 39 శాతంగా ఉండగా, యూఏఈలో ఈ అంచనా ఎక్కువగా ఉంది. మారుతున్న వ్యాపార రంగానికి అనుగుణంగా మేనేజ్‌మెంట్, డేటా, టెక్నాలజీ నైపుణ్యాల అవసరం పెరుగుతోందని ఈ అంచనాలు సూచిస్తున్నాయి.

రెండేళ్ల ఎంబీఏ కోర్సులో ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్స్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ వంటి కీలక అంశాలతో పాటు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అనలిటిక్స్‌పై కూడా అవగాహన కల్పిస్తారు.

ఎంబీఏ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సులో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, బిజినెస్ ఇంటెలిజెన్స్, స్టాటిస్టికల్ మోడలింగ్, విశ్లేషణాత్మక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ రెండు కోర్సుల్లోనూ మూడు సెమిస్టర్ల అకడమిక్ విద్య అనంతరం ఒక సెమిస్టర్ పాటు ప్రాక్టీస్ స్కూల్ ఇంటర్న్‌షిప్ లేదా డిసర్టేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

బీబీఏ (ఆనర్స్) నాలుగేళ్ల కోర్సులో వ్యాపార నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక అంశాలతో పాటు ప్రోగ్రామింగ్, పైథాన్, డిజైన్ థింకింగ్, డిజిటల్ ఎంటర్‌ప్రైజెస్ వంటి సాంకేతిక అంశాలను బోధిస్తారు. విద్యార్థులు డేటా సైన్స్, కంప్యూటింగ్, ఫిన్‌టెక్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పబ్లిక్ పాలసీ వంటి విభాగాల్లో ఇంటర్‌డిసిప్లినరీ మైనర్ కోర్సులను కూడా ఎంచుకోవచ్చు.

ఈ బీబీఏ కోర్సులో మొత్తం ఎనిమిది నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. రెండో సంవత్సరం పూర్తయిన తర్వాత ఎనిమిది వారాల ఇంటర్న్‌షిప్‌, చివరి సంవత్సరంలో ఐదున్నర నెలల పాటు మరో ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది.

విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన అనుభవాన్ని అందించేందుకు కేస్ స్టడీస్, సిమ్యులేషన్స్, లైవ్ ప్రాజెక్టులు, పరిశ్రమల నిపుణులతో ప్రత్యేక ఉపన్యాసాలు నిర్వహిస్తున్నారు. తద్వారా తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను వాస్తవ వ్యాపార పరిస్థితుల్లో అన్వయించే అవకాశం కల్పిస్తున్నారు.

విద్యార్థులు, ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంబీఏ కోర్సులకు డే టైమ్‌తో పాటు ఈవెనింగ్ తరగతుల షెడ్యూల్‌ను కూడా క్యాంపస్ అందిస్తోంది. మేనేజ్‌మెంట్ విద్య, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుభవాన్ని సమన్వయం చేయడం ద్వారా మారుతున్న ఉద్యోగ, వ్యాపార రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలను బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ కల్పిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com