యూఏఈ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారత రాయబారి..!!

- November 15, 2026 , by Maagulf
యూఏఈ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారత రాయబారి..!!

దుబాయ్: యూఏఈలోని ఫుజైరాలో నవంబర్ 12న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై భారత రాయబారి దీపక్ మిట్టల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో భారతీయ బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన యూఏఈ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

షేక్ ఖలీఫా రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు భారతీయులు, 10 మంది ఎమిరేటీలు ఉన్నారు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎమిరేటీలు, ఒమానీలు, భారతీయులు, బ్రెజిలియన్లు, పాకిస్థానీలు, జోర్డానియన్లు, ఈజిప్షియన్లు ఉన్నారు. గాయపడిన భారతీయుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ ప్రమాదంపై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక విచారణ ప్రకారం, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డులో (E84) వరుసగా రెండు ప్రమాదాలు జరిగాయి. మొదట ఓ వాహనం రోడ్డుపై నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు షిప్పింగ్ కంటైనర్లతో వెళ్తున్న మరో ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదానికి బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనను 'తీవ్ర విషాదం'గా అభివర్ణించిన భారత రాయబారి దీపక్ మిట్టల్.. బాధిత కుటుంబాలతో భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో కవల కుమారులు, మనవడిని కోల్పోయిన భారతీయ ప్రవాసి సిద్ధిఖ్ తుబ్లికాట్ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. ఈ తీరని నష్టాన్ని తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

సిద్ధిఖ్ కుటుంబాన్ని యూఏఈ అధ్యక్ష వ్యవహారాల అభివృద్ధి, అమర వీరుల వ్యవహారాల విభాగం డిప్యూటీ చైర్మన్ షేక్ థియాబ్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పరామర్శించారు. అంతకుముందు ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ హమద్ అల్ షర్కీ కూడా బాధిత కుటుంబాన్ని కలిసి సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఫుజైరాలోని ఆసుపత్రుల్లో షేక్ థియాబ్ పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాదంలో మరణించిన భారతీయుల వివరాలు

సిద్ధిఖ్ తుబ్లికాట్‌కు చెందిన కవల పిల్లలు మహమ్మద్, మిస్నా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మూడేళ్ల మనవడు మహమ్మద్ ఫైజ్ కూడా మృతి చెందాడు. ఇక ప్రమాదంలో మరణించిన నాలుగో భారతీయుడి వివరాలు నవంబర్ 14న వెల్లడయ్యాయి. 13 ఏళ్ల భారతీయ బాలుడు తన తల్లిదండ్రులు, అక్కతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు ఫుజైరా ఇండియన్ సెంటర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త తెలిపారు.

గుజరాత్‌కు చెందిన ఈ కుటుంబం యూఏఈ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వెళ్లేందుకు ఫుజైరా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడి తల్లిదండ్రులు, అక్క గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com