బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

- November 16, 2026 , by Maagulf
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, దాని తీవ్రత, తదుపరి పరిణామాల పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రం నుంచి వాతావరణ పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించారు.

ప్రస్తుత అల్పపీడనం సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ అల్పపీడనం ప్రభావం కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలపై ఉండే అవకాశం ఉందని తెలిపారు.

దీంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రభావిత జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వాతావరణ పరిస్థితులపై నిరంతరం నిఘా ఉంచాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com