తొలి 9 నెలల్లో 50.4 మిలియన్ మంది ప్రయాణికులకు సేవలందించిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- November 17, 2026
2026లో 7 కోట్లకు పైగా ప్రయాణికులకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అంచనా
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) 2026 మొదటి తొమ్మిది నెలల్లో 5.04 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. పర్యాటకం, వాణిజ్యం, వ్యాపార రంగాలకు కీలక అనుసంధాన కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో పెరగనున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సాంకేతికత, ఆవిష్కరణలపై దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ పెట్టుబడులు కొనసాగిస్తోంది.
దుబాయ్‌కు నేరుగా వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులతో పాటు ఇతర దేశాలకు కనెక్టింగ్ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా దాదాపు సమతుల్యంగా ఉంది. సెప్టెంబర్ నెలలో మొత్తం ప్రయాణికుల్లో 49 శాతం మంది దుబాయ్‌కు నేరుగా వచ్చి వెళ్లగా, 51 శాతం మంది కనెక్టింగ్ ప్రయాణికులుగా నమోదయ్యారు. శీతాకాలంలో పర్యాటకులు, అంతర్జాతీయ కార్యక్రమాల కారణంగా నేరుగా ప్రయాణించే వారి సంఖ్య సాధారణంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ మాట్లాడుతూ, ఈ ఏడాది 7 కోట్ల మందికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తామని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మరిన్ని విమానయాన సంస్థలు దుబాయ్‌కు తిరిగి వస్తుండటంతో విమాన నెట్వర్క్ మరింత విస్తరిస్తోందన్నారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చడంతో పాటు వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
సాంకేతికతను వినియోగించడం ద్వారా విమానాశ్రయంలోని ప్రక్రియలను సరళీకృతం చేసి, రద్దీని తగ్గించి, ప్రస్తుత మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు. విమానాశ్రయ విస్తీర్ణాన్ని పెంచకుండానే అదనపు సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రస్తుతం DXB నుంచి 101 దేశాల్లోని 235 విమానాశ్రయ గమ్యస్థానాలకు 57 విమానయాన సంస్థలు సేవలందిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో బ్రిటిష్ ఎయిర్వేస్ తన సేవలను పునఃప్రారంభించింది. రాయల్ ఎయిర్ మారోక్, సన్‌ఎక్స్‌ప్రెస్, సెబు పసిఫిక్ వంటి విమానయాన సంస్థలు కూడా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయి. రానున్న వారాల్లో మరికొన్ని సంస్థలు తమ సేవలను పునఃప్రారంభించనున్నాయి.
ప్రయాణికులకు వేగవంతమైన సేవలు
విమానాశ్రయ కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ డిజిటల్ సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌ను వినియోగిస్తోంది. విమానాశ్రయంలోని వివిధ వ్యవస్థల నుంచి సమాచారాన్ని, విజువల్ ఫీడ్లను సమీకరించి కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించే విధానాన్ని అభివృద్ధి చేస్తోంది.
ప్రయాణికుల రద్దీ, విమానాల కదలికలు, విమానాశ్రయంలోని వివిధ ప్రాంతాల వినియోగాన్ని విశ్లేషించడం ద్వారా రద్దీ ఏర్పడే అవకాశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. సెల్ఫ్ సర్వీస్ సదుపాయాలు, బయోమెట్రిక్ ప్రక్రియలను విస్తరించడం ద్వారా మాన్యువల్ పనులను తగ్గించి ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తున్నారు.
2026 మూడో త్రైమాసికంలో బయలుదేరే ప్రయాణికుల్లో 99.9 శాతం మంది పాస్‌పోర్ట్ కంట్రోల్ వద్ద 10 నిమిషాల కంటే తక్కువ సమయం వేచి ఉన్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల్లో 99.9 శాతం మంది అరైవల్ పాస్‌పోర్ట్ కంట్రోల్ వద్ద 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. భద్రతా తనిఖీల వద్ద 99.7 శాతం మంది ప్రయాణికుల నిరీక్షణ సమయం ఐదు నిమిషాల కంటే తక్కువగా నమోదైంది.
4.8 కోట్ల బ్యాగేజీ ప్రాసెసింగ్
2026 మొదటి తొమ్మిది నెలల్లో DXB మొత్తం 4.8 కోట్ల బ్యాగేజీలను ప్రాసెస్ చేసింది. విమానం దిగిన 45 నిమిషాల్లోనే 91 శాతం బ్యాగేజీలను ప్రయాణికులకు అందించారు. బ్యాగేజీ నిర్వహణలో 99.73 శాతం కచ్చితత్వం నమోదైంది. ప్రతి వెయ్యి మంది ప్రయాణికుల్లో 2.67 బ్యాగేజీలు తప్పుగా నిర్వహించబడినట్లు గణాంకాలు వెల్లడించాయి.
సాంకేతికత, మెరుగైన నిర్వహణ విధానాలతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చర్యలు కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ ఇన్నోవేట్స్ 2026 అవార్డులు ప్రదానం..దుబాయ్ పోలీసులకు అత్యున్నత పురస్కారం
- ఖతార్‌లో కొత్తగా 331 ప్రొఫెషనల్ లైసెన్సులు..!!
- తొలి 9 నెలల్లో 50.4 మిలియన్ మంది ప్రయాణికులకు సేవలందించిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- కువైట్ ప్రవాసుల్లో భారతీయులే టాప్..!!
- బహ్రెయిన్ లో ఉగ్రవాద కేసులో జీవిత ఖైదు.. పలువురికి 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- హోర్మజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్ పై దాడి
- ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ దళాలు
- వందేభారత్‌లో చిక్కుకున్న 12 మంది..సెండాఫ్ ఇవ్వడానికి వెళ్తే రూ.36 వేల జరిమానా!
- బహ్రెయిన్‌లో భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజ..!!
- కేరళకు చెందిన భారతీయుడిని వరించిన అదృష్టం..!!







