అల్ జబల్ అల్ అఖ్దర్ మొక్కలతో కొత్త ఉత్పత్తులు..!!

- November 19, 2026 , by Maagulf
అల్ జబల్ అల్ అఖ్దర్ మొక్కలతో కొత్త ఉత్పత్తులు..!!

మస్కట్: ఒమన్‌లోని అల్ జబల్ అల్ అఖ్దర్ (గ్రీన్ మౌంటెన్) ప్రాంతంలో లభించే స్థానిక మొక్కల ద్వారా ఆర్థిక అవకాశాలను పెంపొందించడంపై పరిశోధన, ఆవిష్కరణల ప్రాధికార సంస్థ (RIA) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్థానిక వనరులను ఉపయోగించి కొత్త ఉత్పత్తుల తయారీ, యువతకు వ్యాపార అవకాశాలు కల్పించడం, మొక్కల జన్యు వనరులను పరిరక్షించడం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు.

అల్ దఖిలియా గవర్నరేట్‌లోని అల్ జబల్ అల్ అఖ్దర్‌లో ఉన్న RIA శాఖ ఆధ్వర్యంలో 13వ సీజన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘మానవులు, జన్యు వనరులు’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘అల్ జబల్ అల్ అఖ్దర్: మానవులు, ప్రకృతి, ఆవిష్కరణల కథ’ అనే అంశంపై ప్రారంభ సమావేశం జరిగింది.

జీవవైవిధ్యానికి, మానవ ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాలపై సమావేశంలో వివరించారు. ప్రకృతితో మమేకం కావడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, స్థానిక మొక్కల సువాసనలు గతంలోని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసి మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని చర్చించారు. అల్ జబల్ అల్ అఖ్దర్ ప్రాంతంలో లభించే మొక్కలను ఉపయోగించి వివిధ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న స్థానిక అనుభవాలను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. తద్వారా స్థానిక పంటలకు అదనపు ఆర్థిక విలువ తీసుకురావచ్చని వివరించారు.

పరిశోధనల ద్వారా వెలువడుతున్న ఫలితాలను యువత వ్యాపార అవకాశాలుగా మార్చుకోవాలని, స్థానిక వనరుల ఆధారంగా కొత్త సంస్థలను స్థాపించేందుకు ముందుకు రావాలని సమావేశంలో సూచించారు. అలాగే గత తరాల నుంచి స్థానిక ప్రజలకు అందిన సంప్రదాయ పరిజ్ఞానాన్ని భద్రపరచాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావించారు. స్థానిక మొక్కల కాలానుగుణ మార్పులు, వాటి వినియోగ పద్ధతులకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి పరిశోధకులకు అందుబాటులో ఉంచడం ముఖ్యమని పేర్కొన్నారు.

ఈ సమాచారం ద్వారా పర్వత ప్రాంత పర్యావరణంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి స్థానిక మొక్కల జన్యు వనరులను కాపాడేందుకు చర్యలు తీసుకోవచ్చని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com