దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోలింగ్ ఫ్లీట్లోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్
- November 18, 2026
వరల్డ్ పోలీస్ సమ్మిట్‌లో కొత్త వాహనం ఆవిష్కరణ.. 525 హార్స్పవర్ సామర్థ్యంతో అత్యాధునిక ఫీచర్లు
దుబాయ్: దుబాయ్ పోలీస్ తన లగ్జరీ సెక్యూరిటీ పెట్రోలింగ్ వాహనాల విభాగంలో మరో అత్యాధునిక వాహనాన్ని చేర్చింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender)ను కొత్త పెట్రోలింగ్ వాహనంగా పరిచయం చేసింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ సందర్భంగా అల్ తాయర్ మోటార్స్ సహకారంతో ఈ వాహనాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి దుబాయ్ పోలీస్ డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ (ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలు) మేజర్ జనరల్ డాక్టర్ అహ్మద్ జాల్ బిన్ క్రిషన్ అల్ మెహైరి, అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ (కమ్యూనిటీ హ్యాపీనెస్ అండ్ లాజిస్టిక్స్) మేజర్ జనరల్ డాక్టర్ తారిఖ్ తహ్లక్, ట్రాన్స్పోర్ట్ అండ్ రెస్క్యూ విభాగం ఫోర్స్ వెహికల్స్ డైరెక్టర్ కల్నల్ అన్వర్ అల్ నిమర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేజర్ జనరల్ అల్ మెహైరి మాట్లాడుతూ.. పెట్రోలింగ్ విభాగంలో అత్యాధునిక లగ్జరీ వాహనాలను చేర్చడం ద్వారా పోలీసింగ్ సామర్థ్యాలను ఆధునీకరించడంతో పాటు ఎమిరేట్ వ్యాప్తంగా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు. ఆధునిక వాహన సాంకేతికత, స్మార్ట్ వ్యవస్థలను వినియోగించడం ద్వారా పోలీసు కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు
కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్‌లో ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్ప్లే, 3డీ సరౌండ్ కెమెరా వ్యవస్థ, రిమోట్ కంట్రోల్ సదుపాయం, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్లైట్లు ఉన్నాయి. అలాగే ఆల్ టెర్రైన్ ప్రోగ్రెస్ కంట్రోల్ (ATPC), కాన్ఫిగరబుల్ టెర్రైన్ రెస్పాన్స్, నీటి లోతును గుర్తించే సెన్సార్ వ్యవస్థ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వీటి ద్వారా వివిధ రకాల రోడ్లు, క్లిష్టమైన భూభాగాల్లోనూ వాహనం సులభంగా ప్రయాణించగలదు.
5.0 లీటర్ V8 ఇంజిన్.. 240 కిలోమీటర్ల గరిష్ఠ వేగం
ఈ వాహనంలో 5.0 లీటర్ V8 ఇంజిన్‌ను అమర్చారు. ఇది 525 హార్స్పవర్ శక్తితో పాటు 625 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.
కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ఠంగా గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 90 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగిన ఈ వాహనం బరువు సుమారు 2,585 కిలోగ్రాములు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ కొత్త వాహనం దుబాయ్ పోలీసుల పెట్రోలింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచడంతో పాటు వివిధ ప్రాంతాల్లో భద్రతా సేవలను బలోపేతం చేయనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోలింగ్ ఫ్లీట్లోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్
- తాయిఫ్ గవర్నర్‌తో భారత కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి భేటీ
- చార్మినార్ పరిసరాల్లో నకిలీ వెండి వర్క్ తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
- యూఏఈ నేషనల్ డేకి షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు
- తెలంగాణలో SIR గడువు మళ్లీ పొడిగించిన ఎన్నికల సంఘం
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!







