ఖతార్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!

- November 19, 2026 , by Maagulf
ఖతార్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!

దోహా: ఖతార్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, రెడ్ సిగ్నల్ దాటడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి 11 రకాల ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను స్వాధీనం చేసుకునే అధికారం కోర్టులకు కల్పించింది.

ఖతార్ కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం లా నంబర్ 19 ఆఫ్ 2026 కింద జారీ చేసిన ఆర్టికల్ 117లో ఈ నిబంధనలను పొందుపరిచారు. నేరం రుజువైన తర్వాత ఇతర శిక్షలతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించవచ్చు. అయితే నిజాయితీతో వ్యవహరించిన మూడో పక్షాల హక్కులకు రక్షణ కల్పిస్తారు. ఈ చట్టం 2026 నవంబర్ 18న అధికారిక గెజిట్‌లో ప్రచురితమైంది.

వాహనాలు స్వాధీనం చేసుకునేందుకు అవకాశం ఉన్న 11 ఉల్లంఘనలు ఇవే..
1. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా లేదా ప్రమాదకరంగా వాహనం నడపడం.
2. మద్యం, మాదకద్రవ్యాలు లేదా ఇతర మానసిక ప్రభావిత పదార్థాలు తీసుకుని వాహనం నడపడం.
3. డ్రైవింగ్ సమయంలో చేతితో మొబైల్ ఫోన్ లేదా ఇతర పరికరాలను పట్టుకుని ఉపయోగించడం. ఈ ఉల్లంఘనను మళ్లీ పునరావృతం చేస్తే వాహనం స్వాధీనం చేసుకోవచ్చు.
4. న్యాయస్థానం లేదా సంబంధిత అధికార యంత్రాంగం రద్దు చేసిన అనుమతితో వాహనాన్ని నడపడం.
5. న్యాయస్థానం లేదా పరిపాలనా యంత్రాంగం రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనం నడపడం.
6. ట్రాఫిక్ ప్రమాదానికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడం లేదా పోలీసు అధికారి ఆపమని ఆదేశించినా ఆగకుండా వెళ్లిపోవడం.
7. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ లేదా ట్రాఫిక్ పోలీసుల చేతి సంకేతాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం.
8. నిర్ణయించిన వేగ పరిమితిని గంటకు 60 కిలోమీటర్లకు మించి అధిగమించి వాహనం నడపడం.
9. హైవేలు లేదా రింగ్ రోడ్లపై ట్రాఫిక్‌కు వ్యతిరేక దిశలో వాహనం నడపడం.
10. రాతపూర్వక అనుమతి లేకుండా రోడ్లపై వాహన రేసుల్లో పాల్గొనడం లేదా అనుమతిలో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించడం.

11. రహదారికి నష్టం కలిగించకపోయినా, వాహనాన్ని అకస్మాత్తుగా వేగంగా ముందుకు కదిలించడం లేదా మలుపు తిప్పడం వల్ల టైర్లు తిరుగుతూ శబ్దాలు రావడం. ఈ ఉల్లంఘనను పునరావృతం చేస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.

వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి

ఖతార్‌లో కొత్త ట్రాఫిక్ చట్టం ద్వారా రోడ్డు భద్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రెడ్ సిగ్నల్ దాటడం, ప్రమాదం జరిగిన తర్వాత పారిపోవడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని వాహనదారులకు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com