కువైట్‌లో మారనున్న జ్లీబ్ అల్ షుయూఖ్ రూపురేఖలు..!!

- November 19, 2026 , by Maagulf
కువైట్‌లో మారనున్న జ్లీబ్ అల్ షుయూఖ్ రూపురేఖలు..!!

కువైట్ : కువైట్‌లోని ప్రవాస భారతీయులు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఒకటైన జ్లీబ్ అల్ షుయూఖ్‌లో భారీ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈ ప్రాంతంలోని అక్రమ నివాసాలు, ఆక్రమణలను తొలగించే పనులు పూర్తయిన తర్వాత ఆధునిక, సుస్థిర పట్టణ అభివృద్ధి ప్రాజెక్టుగా తీర్చిదిద్దనున్నట్లు ఫర్వానియా గవర్నర్ షేక్ అథ్బీ అల్ నాసర్ వెల్లడించారు.

ఈ ప్రాంతంలో కొనసాగుతున్న కూల్చివేత పనుల పురోగతిని పరిశీలించేందుకు గవర్నర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఫర్వానియా గవర్నరేట్ మున్సిపాలిటీ డైరెక్టర్ ఇంజినీర్ నవాఫ్ అల్ కందరీ, కువైట్ మున్సిపాలిటీ సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యుడు మహమ్మద్ అల్ జలావీ, జ్లీబ్ ప్రాంత కమాండర్ కల్నల్ మహమ్మద్ అల్ అంజీతో పాటు అంతర్గత వ్యవహారాల శాఖ, కువైట్ మున్సిపాలిటీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

అక్రమ నివాస ప్రాంతాల తొలగింపులో సంబంధిత ప్రభుత్వ శాఖలు చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. త్వరలోనే ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ అభివృద్ధి, సుస్థిర ప్రాజెక్టుల్లో ఒకటిగా మారుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. జ్లీబ్ అల్ షుయూఖ్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచేందుకు కూల్చివేతలు, తొలగింపు చర్యలు చారిత్రాత్మక ముందడుగని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని షేక్ అహ్మద్ అల్ అబ్దుల్లా నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా గవర్నర్ అభినందించారు. రాజకీయ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను నిరంతరం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా, కువైట్ ప్రతిష్ఠను ప్రతిబింబించేలా జ్లీబ్ అల్ షుయూఖ్‌ను ఆధునిక సౌకర్యాలతో కూడిన సుస్థిర పట్టణ అభివృద్ధి ప్రాజెక్టుగా మార్చడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com