నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు త్రిపుర గవర్నర్‌కు ఆహ్వానం

- November 21, 2026 , by Maagulf
నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు త్రిపుర గవర్నర్‌కు ఆహ్వానం

హైదరాబాద్: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు–బాలలు 2026కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని పరిషత్తు అధ్యక్షుడు డా. గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు.

ఈ మేరకు హైదరాబాద్‌లోని లోక్‌భవన్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డా. గజల్ శ్రీనివాస్, మహాసభల నిర్వహణ, లక్ష్యాలు, ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాలల కోసం తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల చిన్నారుల్లో ఆసక్తిని పెంపొందించడంతో పాటు, భావితరాలకు తెలుగు భాషా వైభవాన్ని పరిచయం చేయడమే ఈ మహాసభల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

డిసెంబర్ 19వ తేదీ సాయంత్రం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్‌ను కోరారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులతో పాటు ప్రతిభావంతులైన బాలబాలికలను ఈ సందర్భంగా సత్కరించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ అందించే స్ఫూర్తిదాయక సందేశం చిన్నారులకు ఎంతో ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డా.గజల్ శ్రీనివాస్ కుమార్తె, గాయని కుమారి సంస్కృతి, ప్రముఖ పారిశ్రామికవేత్త కంతేటి కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణం ఈ నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు–బాలలు 2026కు వేదిక కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com