పాత ఫోన్లోనూ 24 క్యారెట్ల బంగారం..!!
- November 21, 2026
దుబాయ్: పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పారేయకుండా వాటిలోని బంగారాన్ని తిరిగి వెలికితీయవచ్చని నిరూపించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. విషపూరిత రసాయనాలు ఉపయోగించకుండానే ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని వేరు చేసే వినూత్న పద్ధతిని ఖలీఫా యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
దుబాయ్ ఫ్యూచర్ వీక్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల విద్యార్థులు, పరిశోధకులు రూపొందించిన 100 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఆరోగ్యం, ఇంధనం, వనరుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ నగరాల అభివృద్ధి వంటి రంగాలకు సంబంధించిన వినూత్న ఆవిష్కరణలు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిలో పాత ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి బంగారం వెలికితీసే ప్రాజెక్టుతో పాటు గర్భధారణ పరీక్షలో హార్మోన్ స్థాయులను గుర్తించే పరికరం, తీవ్రమైన వేడిలో పనిచేసే కార్మికుల శరీరాన్ని చల్లబరిచే పరికరం సందర్శకులను ఆకట్టుకున్నాయి.
పాత ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి బంగారం
పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సర్క్యూట్ బోర్డుల్లో కొంత మొత్తంలో బంగారం ఉంటుంది. అయితే సాధారణంగా దానిని వెలికితీసేందుకు సైనైడ్, మెర్క్యురీ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఖలీఫా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ నజాత్ అల్దక్కా తన బృందంతో కలిసి సుమారు రెండేళ్లపాటు పరిశోధనలు చేశారు. వారు 'ReGold' పేరుతో ప్రత్యేకమైన 2D పోరస్ మెటీరియల్‌ను అభివృద్ధి చేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసినప్పుడు ఏర్పడే ద్రావణం నుంచి ఈ పదార్థం బంగారాన్ని ప్రత్యేకంగా గుర్తించి వేరు చేస్తుంది.
ఈ పరికరం ద్వారా కేవలం ఒక గంటలో ద్రావణంలోని బంగారంలో 99 శాతం వరకు సేకరించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. గంటలో 5.2 గ్రాముల బంగారాన్ని తిరిగి పొందినట్లు, దాని స్వచ్ఛత సుమారు 21 క్యారెట్లుగా ఉన్నట్లు డాక్టర్ నజాత్ తెలిపారు. ఒక గ్రాము బంగారాన్ని వెలికితీసేందుకు సుమారు 1 కిలోవాట్ అవర్ విద్యుత్ అవసరమవుతుందని వివరించారు. ఇతర లోహాలతో పోలిస్తే బంగారాన్ని ఎంపిక చేసుకునే సామర్థ్యం 1,000 రెట్లకు పైగా ఉందని పరీక్షల్లో తేలింది.
ఈ విధానంలో ప్రమాదకర రసాయనాల వినియోగం కూడా ఉండదు. తిరిగి సేకరించిన బంగారాన్ని అధిక విలువ కలిగిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఉపయోగించవచ్చు. తద్వారా కొత్త బంగారం కోసం మైనింగ్‌పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ సాంకేతికతను వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి పారిశ్రామిక భాగస్వాముల కోసం పరిశోధకుల బృందం ఎదురుచూస్తోంది.
గర్భధారణ పరీక్షలోనూ కొత్త విధానం
సాధారణంగా ఇంట్లో చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్టులు పాజిటివ్ లేదా నెగెటివ్ అని మాత్రమే చూపిస్తాయి. అయితే కొత్తగా రూపొందించిన 'Della Dx' పరికరం రక్తంలోని నిర్దిష్ట హార్మోన్ల స్థాయిని కూడా గుర్తించగలదు. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. ప్రత్యేకమైన సెల్ఫ్రీ బయోలాజికల్ సిస్టమ్ ద్వారా నిర్దిష్ట ప్రోటీన్లను గుర్తించి, వాటి పరిమాణాన్ని రంగు మార్పు ద్వారా తెలియజేస్తుంది.
మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తొలుత గర్భధారణకు సంబంధించిన HCG హార్మోన్ స్థాయులను గుర్తించే విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యకరమైన గర్భధారణలో ఈ హార్మోన్ స్థాయి ప్రతి 48 నుంచి 72 గంటలకు రెట్టింపు అవుతుంది. గర్భస్రావం జరిగే సందర్భాలను ముందుగానే గుర్తించడంలో ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై సుమారు 12 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అవసరమైన నియంత్రణ సంస్థల అనుమతులు లభిస్తే మరో ఐదేళ్లలో మార్కెట్లోకి తీసుకురావాలని బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
వేడిలో పనిచేసే కార్మికులకు కూలింగ్ కాలర్
తీవ్రమైన ఎండలో పనిచేసే నిర్మాణ రంగ కార్మికులు, ఫ్యాక్టరీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు 'Mexar Vapour' పేరుతో మరో పరికరాన్ని రూపొందించారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ పరికరాన్ని మెడ చుట్టూ ధరించాలి. ఇది చర్మ ఉష్ణోగ్రతను తగ్గించి, అధిక వేడి కారణంగా శరీరంపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. దీనికి అనుబంధంగా ఉండే మానిటరింగ్ వ్యవస్థ కార్మికుల వేడి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ప్రమాద పరిస్థితులు ఎదురైతే హెచ్చరికలు జారీ చేస్తుంది. వేడి, తేమ అధికంగా ఉండే పరిస్థితుల్లో నిర్మాణ కార్మికులపై ఈ పరికరాన్ని పరీక్షించారు. ఎండ వేడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంతో పాటు కార్మికుల భద్రత, పని సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.
భవిష్యత్ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపించడమే లక్ష్యంగా దుబాయ్ ఫ్యూచర్ వీక్‌లో ఈ ప్రాజెక్టులను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..!!
- సుల్తాన్ హైతమ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు..!!
- పాత ఫోన్లోనూ 24 క్యారెట్ల బంగారం..!!
- 2026లో కువైట్ చమురేతర రంగం 1.5% వృద్ధి..!!
- దుబాయ్ రన్ 2026కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఫుల్ గైడ్..!!
- ఖతార్‌లో నవంబర్ 26, 27 తేదీల్లో ‘పాసేజ్ టు ఇండియా 2026’..!!
- కువైట్‌లో 30 శాతం పెరిగిన రెంట్స్..!!
- హౌతీలపై సౌదీ నేతృత్వంలో భారీ సైనిక ఆపరేషన్..!!
- ఒమన్ యువతకు శుభవార్త..!!
- బహ్రెయిన్‌లో ప్రవాస కార్మికుల విద్యార్హతలపై కఠిన తనిఖీలు..!!







