ఖతార్‌లో చిన్నారుల కోసం ప్రత్యేక పార్కులు..!!
- November 21, 2026
దోహా: చిన్నారుల కోసం సురక్షితమైన ఆట స్థలాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, వినోదంతో కూడిన అభ్యాస కేంద్రాలను ఖతార్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పిల్లల్లో శారీరక చురుకుదనం, సామాజిక పరస్పర సంబంధాలు, నైపుణ్యాల పెంపునకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలు ఆనందంగా సమయం గడిపేందుకు వీలుగా పార్కులు, బీచ్‌లలో వివిధ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిల్డ్రన్స్ స్ట్రీట్, అల్ ఖోర్ సైకిల్ పార్క్, అల్ ఖతీఫియా పార్క్‌లో ప్రత్యేక ఆట స్థలాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు పలు పార్కులు, బీచ్‌లలో సురక్షితమైన ఆట స్థలాలను అందుబాటులోకి తెస్తున్నారు.
ఆటలతోనే రహదారి భద్రతపై అవగాహన
చిల్డ్రన్స్ స్ట్రీట్‌లో ఆటల ద్వారా విద్య నేర్చుకునే విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ చిన్నారులు వివిధ ప్రాక్టికల్ కార్యకలాపాల ద్వారా రహదారి భద్రతా నియమాలను తెలుసుకోవచ్చు. అలాగే స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, ఇతర నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఏర్పాట్లు చేశారు.అల్ ఖోర్ సైకిల్ పార్క్‌లో పిల్లల కోసం ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. సైకిళ్లు, స్కూటర్లను సురక్షితంగా నడిపేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించారు. పెద్దల కోసం వాకింగ్, సైక్లింగ్ మార్గాలతో పాటు పిల్లలకు ఆట స్థలాలు, విశ్రాంతి తీసుకునేందుకు పచ్చని ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ పరిమాణాల్లో ఉచిత సైకిళ్లను కూడా పిల్లలకు అందిస్తున్నారు.
దివ్యాంగ పిల్లలకూ ప్రత్యేక ఆట సదుపాయాలు
అల్ ఖతీఫియా పార్క్‌లో దివ్యాంగ చిన్నారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఆట పరికరాలను ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల పిల్లలు సమానంగా వినోద కార్యక్రమాల్లో పాల్గొనేలా వీటిని రూపొందించారు. ఈ సదుపాయాలు పిల్లల్లో శారీరక కదలికలు, ఇంద్రియ స్పందనలు, సామాజిక నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడనున్నాయి. ఇతర పిల్లలతో కలిసి ఆటల్లో పాల్గొనే అవకాశం కల్పించడమే వీటి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇక వివిధ వయసుల పిల్లల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా పార్కులు, బీచ్‌లలో మరిన్ని సురక్షితమైన ఆట స్థలాలు, వినోద సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో చిన్నారుల కోసం ప్రత్యేక పార్కులు..!!
- సౌదీ అరేబియాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..!!
- సుల్తాన్ హైతమ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు..!!
- పాత ఫోన్లోనూ 24 క్యారెట్ల బంగారం..!!
- 2026లో కువైట్ చమురేతర రంగం 1.5% వృద్ధి..!!
- దుబాయ్ రన్ 2026కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఫుల్ గైడ్..!!
- ఖతార్‌లో నవంబర్ 26, 27 తేదీల్లో ‘పాసేజ్ టు ఇండియా 2026’..!!
- కువైట్లో 30 శాతం పెరిగిన రెంట్స్..!!
- హౌతీలపై సౌదీ నేతృత్వంలో భారీ సైనిక ఆపరేషన్..!!
- ఒమన్ యువతకు శుభవార్త..!!







