సౌదీ అరేబియాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..!!

- November 21, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..!!

రియాద్: సౌదీ అరేబియాలోకి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. దుబా పోర్టు ద్వారా ఆరు వేర్వేరు ట్రక్కుల్లో తరలిస్తున్న 2.3 మిలియన్లకు పైగా యాంఫెటమిన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) అధికార ప్రతినిధి హమూద్ అల్ హర్బీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆరు ట్రక్కులు కాంక్రీట్ ఇటుకల లోడుతో దుబా పోర్టు మీదుగా సౌదీలోకి ప్రవేశించాయి. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇటుకల లోపల ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మాదకద్రవ్యాలను దాచినట్లు గుర్తించారు. ఆధునిక భద్రతా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డ్రగ్స్ గుర్తించే శిక్షణ పొందిన జాగిలాల సహాయంతో ఈ అక్రమ రవాణాను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ పట్టుబడిన అనంతరం సౌదీ మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం (GDNC)తో ZATCA అధికారులు సమన్వయం చేసుకున్నారు. దేశంలో ఈ మాదకద్రవ్యాలను స్వీకరించాల్సిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

అక్రమ రవాణాపై కఠిన నిఘా

దేశంలోని అన్ని కస్టమ్స్ పోర్టుల ద్వారా జరిగే దిగుమతులు, ఎగుమతులపై తనిఖీలను మరింత పటిష్టం చేస్తున్నట్లు ZATCA ప్రతినిధి తెలిపారు. మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవడం తమ ప్రధాన వ్యూహాత్మక లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు. సమాజ భద్రత, ప్రజల రక్షణ కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మాదకద్రవ్యాల నియంత్రణ విభాగంతో కలిసి నిరంతరం పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com