దుబాయ్ రన్ 2026కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఫుల్ గైడ్..!!
- November 21, 2026
దుబాయ్: దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్‌లో భాగంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ‘దుబాయ్ రన్ 2026’కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 22న షేక్ జాయెద్ రోడ్డును భారీ రన్నింగ్ ట్రాక్‌గా మార్చనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రన్నింగ్ కార్యక్రమంగా పేరొందిన ఈ ఈవెంట్లో కుటుంబాలు, చిన్నారులు, యువత, వృద్ధులు ఇలా అన్ని వయసుల వారు పాల్గొనవచ్చు.
పాల్గొనేవారు 5km లేదా 10km మార్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. పరుగెత్తడం, జాగింగ్ చేయడం లేదా నడవడం ద్వారా తమకు అనుకూలమైన వేగంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు. అధికారిక దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఉదయం 6.30 గంటలకు ప్రారంభం
దుబాయ్ రన్ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే పాల్గొనేవారికి ఉదయం 4 గంటల నుంచే వేర్వేరు రిపోర్టింగ్ సమయాలు కేటాయించారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎంపిక చేసుకున్న సమయానికే చేరుకోవాలి. భద్రతా కారణాలతో ప్రతి స్లాట్‌కు పరిమిత సంఖ్యలోనే అనుమతి ఉంటుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభ లైన్ మూసివేస్తారు.
5km, 10km మార్గాలు ఇవే
5km మార్గం మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ సమీపంలోని షేక్ జాయెద్ రోడ్డుపై ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఒపెరా మీదుగా దుబాయ్ మాల్ సమీపంలో ముగుస్తుంది. కుటుంబాలు, చిన్నారులు, తొలిసారి పాల్గొనేవారికి ఈ మార్గం అనుకూలంగా ఉంటుంది.
10km మార్గం కూడా మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ సమీపంలోనే ప్రారంభమవుతుంది. దుబాయ్ కెనాల్ బ్రిడ్జిని దాటుకుని, షేక్ జాయెద్ రోడ్డుపై నిర్ణీత మార్గంలో కొనసాగి DIFC గేట్ సమీపంలో ముగుస్తుంది.
ఉదయం 3 నుంచి 10 గంటల వరకు రోడ్ల మూసివేత
దుబాయ్ రన్ సందర్భంగా ఆదివారం ఉదయం 3 గంటల నుంచి 10 గంటల వరకు పలు ప్రధాన రహదారులను మూసివేయనున్నారు.
* ట్రేడ్ సెంటర్ జంక్షన్ నుంచి అల్ సఫా బ్రిడ్జి వరకు షేక్ జాయెద్ రోడ్.
* అడ్రస్ హోటల్ నుంచి ఫ్యాషన్ పార్కింగ్ వరకు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్.
* షేక్ జాయెద్ రోడ్ నుంచి అల్ ఖైల్ రోడ్ వరకు లోయర్ ఫైనాన్షియల్ సెంటర్ స్ట్రీట్.
* షేక్ జాయెద్ రోడ్ నుంచి అల్ బోర్సా స్ట్రీట్ వరకు అల్ సుకూక్ స్ట్రీట్.
వాహనదారులు ప్రత్యామ్నాయంగా అప్పర్ ఫైనాన్షియల్ సెంటర్ స్ట్రీట్, జాబీల్ ప్యాలెస్ రోడ్, అల్ వసల్ రోడ్, అల్ ఖైల్ రోడ్లను ఉపయోగించాలని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) సూచించింది.
పార్కింగ్, మెట్రో ప్రయాణ వివరాలు
కార్లలో వచ్చే వారు 10km మార్గంలో పాల్గొనేవారైతే దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పార్కింగ్‌లో, 5km మార్గంలో పాల్గొనేవారైతే దుబాయ్ మాల్ పార్కింగ్‌లో వాహనాలు నిలిపి మెట్రోలో ప్రారంభ ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.
దుబాయ్ మాల్, దుబాయ్ మాల్ జాబీల్, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లలో కలిపి సుమారు 15,000 పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయి. ఇక 5km మార్గంలో పాల్గొనేవారు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో స్టేషన్లో, 10km మార్గంలో పాల్గొనేవారు ఎమిరేట్స్ టవర్స్ మెట్రో స్టేషన్లో దిగాలి. మెట్రోలో ప్రయాణించేందుకు నోల్ కార్డులో కనీసం Dh15 బ్యాలెన్స్ ఉంచుకోవాలని సూచించారు.
ట్యాక్సీలకు కూడా ప్రారంభ ప్రాంతాల సమీపంలో ప్రత్యేక డ్రాప్ఆఫ్, పికప్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. బుర్జ్ ఖలీఫా/దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సులు, ట్యాక్సీల కోసం ఉపయోగించే రహదారిని 2026 చివరి వరకు మూసివేశారు. అందువల్ల బిజినెస్ బే మెట్రోకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాలని నిర్వాహకులు సూచించారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు తమ రన్నింగ్ బిబ్, టీషర్ట్‌ను దుబాయ్ మున్సిపాలిటీ 30x30 ఫిట్నెస్ విలేజ్, జాబీల్ పార్క్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే QR కోడ్ చూపిస్తే ఇతరుల తరఫున కూడా బిబ్ తీసుకోవచ్చు. బిబ్ లేకుండా రన్లో పాల్గొనేందుకు అనుమతి ఉండదు. బిబ్ పోగొట్టుకుంటే మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకుని కొత్తది పొందాలి.
సాలిక్ టోల్ ఛార్జీలు
దుబాయ్ రన్ రోజున సాలిక్ టోల్ ఛార్జీలు కూడా వర్తిస్తాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు Dh6 వసూలు చేస్తారు. సాధారణంగా ఈ సమయంలో ఉండే Dh4 ఛార్జీ కంటే ఇది ఎక్కువ. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు Dh4 ఉంటుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా Dh4 వసూలు చేస్తారు. ఇక తెల్లవారుజామున 1 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎప్పటిలాగే టోల్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ప్రత్యేక దుస్తులతో వస్తే Dh10,000 బహుమతి
ఈసారి ‘డ్రెస్ యువర్ రన్’ పేరుతో ప్రత్యేక పోటీ నిర్వహిస్తున్నారు. వినూత్నమైన, రంగురంగుల, ఆకర్షణీయమైన దుస్తులతో పాల్గొనేవారికి బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించారు. మొత్తం 10 మంది విజేతలకు ఒక్కొక్కరికి Dh10,000 చొప్పున అందజేస్తారు. మొత్తం బహుమతుల విలువ Dh100,000 అని నిర్వాహకులు ప్రకటించారు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
దుబాయ్ రన్ పోటీ కాదు. ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన వేగంతో మార్గాన్ని పూర్తి చేయవచ్చు. తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు గరిష్ఠంగా ముగ్గురు పిల్లలను రిజిస్టర్ చేయవచ్చు. 18 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా పెద్దవారి తోడుతో పాల్గొనాలి. అదే సమయంలో పెద్ద బ్యాగులకు అనుమతి లేదు. అవసరమైన వ్యక్తిగత వస్తువులను మాత్రమే తీసుకురావాలి. 5km మార్గంలో బేబీ స్ట్రోలర్లకు అనుమతి ఉంది. పెంపుడు జంతువులను తీసుకురావడానికి మాత్రం అనుమతి లేదు.
రన్ జరిగే మార్గమంతా వైద్య సహాయం, మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అత్యవసర సహాయం అవసరమైతే సమీపంలోని దుబాయ్ రన్ మార్షల్ లేదా వైద్య సిబ్బందిని సంప్రదించాలి. లేదా 901 నంబర్‌కు కాల్ చేయవచ్చు. ప్రారంభ, ముగింపు ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో టాయిలెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ రన్ 2026కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఫుల్ గైడ్..!!
- ఖతార్‌లో నవంబర్ 26, 27 తేదీల్లో ‘పాసేజ్ టు ఇండియా 2026’..!!
- కువైట్‌లో 30 శాతం పెరిగిన రెంట్స్..!!
- హౌతీలపై సౌదీ నేతృత్వంలో భారీ సైనిక ఆపరేషన్..!!
- ఒమన్ యువతకు శుభవార్త..!!
- బహ్రెయిన్‌లో ప్రవాస కార్మికుల విద్యార్హతలపై కఠిన తనిఖీలు..!!
- వారం రోజుల్లో 1,903 ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లను స్వాధీనం చేసుకున్న దుబాయ్ పోలీసులు
- Dubai Police Impound 1,903 Electric Bikes and Scooters in One Week, Warn Against Dangerous Stunts
- నేపాల్ పై భారత్-ఎ 306 పరుగుల చారిత్రక విజయం!
- ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకలు..GCC దేశాల్లో ఒమన్ జెండా రంగులతో మెరిసిన భవనాలు







